మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీ | Sakshi
Sakshi News home page

మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీ

Published Sun, Oct 9 2016 5:04 AM

మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీ - Sakshi

చైనా దెబ్బతినడంతో ప్రపంచం మన వైపు చూస్తోంది: సీఎం
 
 సాక్షి, అమరావతి : తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్)లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా తయారు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలో జరిగిన సీఐఐ సదరన్ రీజియన్ కౌన్సిల్ అంతర్గత సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో తయారీ రంగంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు.

వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్, ఐవోటీ వంటి రంగాల్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు వీటికి సంబంధించి విలువ ఆథారిత పరిశ్రమలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం సీఐఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాడానికి స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఐ దక్షిణ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల, సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శివకుమార్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 60 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

 కృష్ణా రివర్‌ఫ్రంట్ అభివృద్ధి: ప్రకాశం బ్యారేజీకి ఎగువన రాజధాని వైపు 32 కిలోమీటర్ల మేర కృష్ణా రివర్ ఫ్రంట్‌ను బ్లూ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి డిజైన్లు రూపొందించాలని సూచించారు. శనివారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో రాజధాని వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు.

 పట్టువస్త్రాలు సమర్పించిన బాబు దంపతులు
 విజయవాడలో  రోజూ పండుగ వాతావరణ కనపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వచ్చే డిసెంబర్‌లో విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాలని యోచిస్తున్నామని ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీకనకదుర్గమ్మ వారు  శనివారం శ్రీసరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శనివారం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, లాంఛనాలు సమర్పించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement