Sakshi News home page

3 నెలల్లో ల్యాండ్ పూలింగ్

Published Thu, Dec 25 2014 3:21 AM

AP assembly approval to make land pooling in 3 months

* గవర్నర్‌కు చేరిన సీఆర్‌డీఏ బిల్లు  
* జనవరి తొలి వారంలో నోటిఫికేషన్
* రైతులు కోర్టుకు వెళ్లకుండా కేవియెట్!

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదముద్ర వేయడంతో భూ సమీకరణకు ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. సీఆర్‌డీఏ బిల్లు మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడం లాంఛనమే కావడంతో సాధ్యమైనంత త్వరగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆర్నెల్ల గడువు ఉండటంతో ఈలోగా భూ సమీకరణను పూర్తి చేయాలని యోచిస్తోంది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే జనవరి మొదటి వారంలో భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత భూ సమీకరణకు ముందుకు వచ్చే రైతులతో ఒప్పందాలు చేసుకునేందుకు సీఆర్‌డీఏకు అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఒప్పంద పత్రాలు కూడా వెంటనే రైతులకిచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం సీఆర్‌డీఏకు అవసరమైన అధికారుల నియామకాలు చేపడుతున్నారు. మరోవైపు భూ సమీకరణకు విముఖంగా ఉన్న రైతులతోనూ చర్చలు కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
 
 ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించే రైతులు న్యాయస్థానాల్ని ఆశ్రయించే అవకాశం ఉన్నందున ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ప్రభుత్వమే హైకోర్టులో కేవియెట్ దాఖలు చేయనున్నట్లు ఉన్నత వర్గాల సమాచారం. ప్రభుత్వం హైకోర్టులో కేవియెట్ దాఖలు చేస్తే రైతులు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కోర్టు ఎటువంటి స్టే ఇచ్చే అవకాశం ఉండదు. న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోనే లీగల్ అథారిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ న్యాయవాదుల్ని నియమించేందుకు గుంటూరు జిల్లా కలెక్టరును ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లోనూ రెవెన్యూ రికార్డులు, హక్కులు, హద్దులపై ఎలాంటి వివాదాలు లేకుండా పక్కాగా రెవెన్యూ రికార్డులను సిద్ధం చేయడానికి 62 మంది రెవెన్యూ అధికారులను పంపుతోంది. మొత్తమ్మీద సీఆర్‌డీఏ బిల్లు ఆమోదం తర్వాత సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
 
 సింగపూర్‌తో సంప్రదింపులకు 2 కమిటీలు
 రాజధాని నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వం, అక్కడ ప్రైవేట్ కంపెనీలతో సంప్రదింపులకు రెండు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఉన్నతస్థాయి కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతోపాటు ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉన్నారు. అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ. గిరిధర్ నేతృత్వంలో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వర్కింగ్ కమిటీలో సీఆర్ డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ డెరైక్టర్ ఉంటారు. సింగపూర్ కంపెనీలతో రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపకల్పనపై కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు ఆ కంపెనీలతో సంప్రదింపులను గిరిధర్ నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ చేయనుంది. వర్కింగ్ కమిటీ ఎప్పటికప్పుడు సింగపూర్ కంపెనీలు, ప్రభుత్వంతో సమన్వయం చేయనుంది. సింగపూర్ కంపెనీలు అడిగే వివరాలను అందజేయడంతోపాటు మాస్టర్ ప్రణాళిక రూపకల్పనలో వర్కింగ్ కమిటీ సహకరించనుంది. సీఎం నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సింగపూర్ కంపెనీలు, ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల గురించి సంప్రదింపులు జరపనుందని అధికార వర్గాలు తెలిపాయి.
 
 సీఆర్‌డీఏకు తుడా టౌన్ ప్లానింగ్ అధికారి
 సీఆర్‌డీఏ (రాజధాని ప్రాధికార సంస్థ)కు ఉద్యోగుల డిప్యుటేషన్‌ల పరంపర మొదలైంది. సీఆర్‌డీఏకు ఎన్.శ్రీకాంత్ కమిషనర్‌గా ఉన్నారు. ఇప్పుడు కిందిస్థాయి ఉద్యోగుల నియామక ప్రక్రియ మొదలైంది. తాజాగా తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)లో పట్టణ ప్రణాళికాధికారిగా ఉన్న రామకృష్ణారావును నియమిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ప్రస్తుతం హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. తక్షణమే ఈయనను రిలీవ్ చెయ్యాలని, తుడా వైఎస్ చైర్మన్, హెచ్‌ఎండీఏ కమిషనర్లను కోరారు. ఈయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement