Sakshi News home page

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published Mon, Aug 18 2014 12:17 AM

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - Sakshi

వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు  20న సాధారణ బడ్జెట్.. 22న వ్యవసాయ బడ్జెట్
 
హైదరాబాద్: అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహప్రతివ్యూహాల మధ్య సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమైంది. ఎలాంటి షరతులు లేకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్న హామీని నిలబెట్టుకోకుండా రెండున్నర నెలలుగా దాటవేత వైఖరిని ప్రదర్శించడాన్నే ప్రధాన అస్త్రంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షం సిద్ధమైంది.

ఈ సమావేశాలను వచ్చే నెల 12 వరకు నిర్వహించాలని ముందుగా భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లతో ఆదివారం గవర్నర్ నిర్వహించిన సమావేశంలో జరిగిన చర్చల మేరకు సమావేశాలను కుదించారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఏపీ శాసన సభ సమావేశాలను 6వ తేదీతో ముగించాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరిగితే అసౌకర్యం కలుగుతుందని గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలు, స్పీకర్ల సమావేశంలో ప్రస్తావించారు. తేదీల్లో మార్పులు చేసుకోవాలని, ఈ విషయంలో ఎటువంటి వివాదాలకు తావివ్వరాదని సూచించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ వచ్చే నెల 6వ తేదీతో సమావేశాలు ముగిస్తామని, అదే రోజు సభను నిరవధికంగా వాయిదా వేస్తామని చెప్పారు. శనివారాలు కూడా సభ నిర్వహిస్తామని, ఆదివారాలు, వినాయక చవితికి మాత్రమే సెలవులుంటాయని, ఇలా చేస్తే నిబంధనల మేరకు సభ జరిగే రోజులు సరిపోతాయని తెలిపారు.

 సోమవారం ఉదయం 8 గంటలకు సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తుంది. 9 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. 20న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీకి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవే శపెడతారు. మండలిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 22న వ్యవసాయ బడ్జెట్ పేరుతో వ్యవసాయ అనుబంధ రంగాల కేటాయింపులతో కూడిన కార్యచరణ ప్రణాళికను వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. సోమవారం ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్కరణల చట్టంలో సవరణలు, వ్యవసాయ మార్కెటింగ్ చట్టంలో సవరణలు,  దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు విజన్-2029 డాక్యుమెంట్‌తో పాటు ఏడు రంగాల మిషన్లపై ప్రసంగించాలనే వ్యూహంలో ఉన్నారు.
 

Advertisement
Advertisement