ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ లో గందరగోళం | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ లో గందరగోళం

Published Fri, Mar 3 2017 5:35 PM

ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ లో గందరగోళం - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ అనేక అనుమానాలకు తావిస్తోంది. మార్చి 6 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదివరకే ప్రకటన చేశారు. అయితే దానిపై అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ జారీ కాలేదు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కేబినెట్ లో తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా శాసనసభలో తప్ప బయట వెల్లడించడానికి వీలులేదు. పైగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో 6 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు గవర్నర్ పేరుతో శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. అయితే విచిత్రంగా ఆ నోటిఫికేషన్ శుక్రవారం జారీ అయినట్టు కాకుండా గత నెల ఫిబ్రవరి 26 వ తేదీన జారీ చేసినట్టు పేర్కొనడం విచిత్రం. ఆ రోజున నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 11.06 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుందని పేర్కొంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన తేదీ ప్రకారం ఫిబ్రవరి 26 వ తేదీనే నోటిఫికేషన్ జారీ అయితే ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించడానికి వీలులేదు.

టీడీపీ ప్రభుత్వం శాసనసభ సంప్రదాయాలేవీ పాటించడం లేదన్న విమర్శలు గడిచిన రెండున్నరేళ్లుగా అనేక విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వాటినేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వెలగపూడిలో శాసనసభ నూతన భవనం ప్రారంభోత్సవానికి కూడా ప్రతిపక్ష రాజకీయ పార్టీని, సభలో సభ్యులను ఆహ్వానించకుండానే ఏకపక్ష ధోరణిలో ప్రారంభోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరుపడిన తర్వాత వెలగపూడిలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవం చేయాలంటే సభలోని అన్ని పక్షాలను ఆహ్వానించాల్సిన కనీస సంప్రదాయం పాటించకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement