విపక్షానికి ‘కాలపరిమితి’ | Sakshi
Sakshi News home page

విపక్షానికి ‘కాలపరిమితి’

Published Thu, Aug 28 2014 1:28 AM

విపక్షానికి ‘కాలపరిమితి’ - Sakshi

* అధికార పక్షానికి అనేక అవకాశాలు - రాష్ట్ర అసెంబ్లీలో కొత్త సంప్రదాయం
* ప్రతిపక్ష నేత పది నిమిషాలు సమయం కోరినా ఇచ్చేందుకు ససేమిరా
* గంటల తరబడి విపక్షాన్ని విమర్శిస్తూ అధికారపక్ష సభ్యుల ప్రసంగాలు
* సభలో విపక్షం నిరసన  తెలుపుతున్నా.. సమన్వయపరచే చర్యలు లేవు
* సమయం చాలకపోతే సాయంత్రం వేళ సభలు నిర్వహించుకోలేదా?
* దూషణలు, తిట్ల పురాణాలతో చట్టసభలు ప్రజల్లో చులకనవుతాయి
* ఏపీ శాసనసభలో పరిణామాలపై సీనియర్లు, మాజీ సభ్యుల ఆందోళన

 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త శాసనసభ ప్రతి అంశంలోనూ సరికొత్త సంప్రదాయాలకు తెరతీస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలను చూస్తే.. సభ గత సంప్రదాయాలకు భిన్నంగా సాగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సభ సజావుగా సాగడానికి అవసరమైతే విపక్షానికి కొంత సమయమిచ్చి మాట్లాడిస్తూ సమన్వయంతో అసెంబ్లీని కొనసాగించడం ఆనవాయితీగా జరుగుతోంది. అయితే ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో బడ్జెట్‌పై తాను ప్రారంభించిన చర్చపై మరికొంత సమయం ఇస్తే ముగిస్తానని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గత రెండు రోజులుగా అడుగుతున్నప్పటికీ సమయం ఇవ్వలేదు. అందుకు ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేస్తుండగా.. ఆ సమయంలో అధికార పార్టీకి చెందిన దాదాపు 12 మంది సభ్యులు విపక్షంపై విరుచుకుపడటానికి గంటలకు పైగా సమయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
 10 నిమిషాలు అడిగితే ఇవ్వకుండా.. గంటల సేపు విమర్శలా?
 గత శాసనసభల్లో విపక్ష నేతలు మరింత సమయం కావాలని కోరినప్పుడు సభాపతులు ఆ వెసులుబాటు కల్పించిన సంఘటనలు అనేకం ఉన్నాయని మాజీ సభ్యులు అభిప్రాయపడ్డారు. విపక్షానికి కాల పరిమితి అన్న దానికి కూడా అర్థం ఉంటుందని, ఇచ్చిన సమయంలో సజావుగా వినియోగించుకునే ఆస్కారం కల్పించాల్సిన బాధ్యత కూడా సభపైన.. ముఖ్యంగా అధికార పక్షానికి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అలాకాకుండా అధికార పక్షమే అడ్డుపడుతూ మరోవైపు సమయం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించడం మంచి సంప్రదాయం కాదని తప్పుపడుతున్నారు.
 
పైగా సభలో సభ్యులు ఎవరైనా పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న దశల్లో సభ ఆర్డర్‌లో లేని పరిస్థితులు తలెత్తినప్పుడు.. అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోతే సాధారణంగా సభను వాయిదా వేయడం, ఆ తర్వాత సంప్రదింపుల ద్వారా సయోధ్యకు రావడమన్న గత సంప్రదాయాలను తల పండిన నేతలు గుర్తుచేస్తున్నారు. సమావేశాలకు సమయం తక్కువగా ఉన్నప్పుడు సాయంత్రం సమావేశాలు నిర్వహించిన సందర్భాలనూ వారు ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి మరింత సమయం కేటాయిస్తే ఈ రెండు రోజుల పాటు వృథా అయిన సమయం కలిసొచ్చేదని మాజీ సీనియర్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. పది నిమిషాలు కేటాయిస్తే పోయేదానికి అధికార పక్షం ఎందుకు భీష్మించుకుందో అర్థంకావడం లేదన్నారు.
 
 సమన్వయం చేసుకుకోవాల్సిన బాధ్యత అధికారపక్షానిదే...
 సభలో ఏకైక ప్రతిపక్షం ఉన్నప్పుడు సమన్వయ పరుచుకోవలసిన బాధ్యత అధికార పక్షంవైపు ఉండగా, అందుకు భిన్నంగా అధికార పక్షమే సబ్జెక్ట్ కాకుండా ఏవేవో విషయాలు మాట్లాడుతూ విలువైన సమయాన్ని వృథా చేయడమే అవుతుందన్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద తమ నిరసన తెలియజేస్తున్న తరుణంలో వారిని వారించే ప్రయత్నం అధికార పక్షం చేయాలే తప్ప అలాంటి సమయంలో కావాలని మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు, వ్యక్తిగత దూషణలు చేయడం సభ సంప్రదాయం అనిపించుకోదని మాజీ మంత్రి ఒకరు చెప్పారు. ఒకరుకాదు ఇద్దరుకాదు పదేసి మంది అధికార పక్షం నుంచి మాటల విసుర్లు చేయటం కన్నా ప్రతిపక్షం కోరిన పది నిమిషాల సమయం ఇచ్చివుండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
దూషణలతో ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది...
 ఈ సమావేశాల్లో కొందరు సభ్యులు వాడిన పరుష పదాలను అన్‌పార్లమెంటరీగా భావించి రికార్డులను పరిశీలించాలన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత కూడా తిరిగి పదేపదే అవే పదాలను వాడుతున్నా వాటిని యధేచ్చగా కొనసాగించడం మంచి సంప్రదాయం కాదన్నారు. స్పీకర్ సమయం ఇచ్చిందే ఆలస్యమన్నట్టు తమ స్థానం నుంచి లేచి మైక్ ముందు దూషణలు, తిట్ల పురాణం కొనసాగించడం వల్ల చట్ట సభలపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
 
 మంగళవారం స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్ష పార్టీ సభ్యులు నిరసన తెలియజేస్తున్న తరుణంలో సభ ఆర్డర్‌లో లేనప్పటికీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కె.ఇ.కృష్ణమూర్తి, అచ్చన్నాయుడు, పీతల సుజాత, రావెల కిశోర్‌బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలతో పాటు చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, సభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాగిత వెంకట్రావు, గొల్లపల్లి సూర్యారావు ఇలా వరుస పరంపరగా మాట్లాడారు. కొందరు సభ్యులు అడ్డగోలు పదజాలాన్ని కూడా ఉపయోగించారు. అన్ పార్లమెంటరీ పదాలను యథేచ్చగా వాడటాన్ని నియంత్రించకపోతే రానున్న రోజుల్లో సృతిమించే ప్రమాదం ఉంటుందని మాజీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement