వాల్మీకులను మోసగించిన బాబు | Sakshi
Sakshi News home page

వాల్మీకులను మోసగించిన బాబు

Published Mon, Nov 13 2017 7:28 AM

AP BC Association President Uday Kiran fire on Chandrababu Naidu - Sakshi

ఆలూరు: ‘వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి మోసం చేశారు. ఆయనకు వాల్మీకుల సత్తా ఏంటో చూపించేందుకు  ఇంటికో వాల్మీకితో అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కావాలి’అని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌ కిరణ్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వాల్మీ కి సేవా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏరూరు రంగ స్వామి ఆధ్వర్యంలో వాల్మీకుల సమావేశం నిర్వహించారు. అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి గర్జిస్తే ప్రభుత్వ పతనం తప్పదన్నారు. 

 వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే చిత్తశుద్ధి సీఎంకు లేదన్నారు. ఆయన అగ్రవర్ణాలకు తొత్తుగా మారారని ఆరోపించారు.  బీసీలకు సముచిత స్థానం ఇస్తామని మాయమాటలు చెబుతుంటారని, ఎవరూ నమ్మవద్దని కోరారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. తక్కువ జనాభా కలిగిన కాపులకు  వెయ్యి కోట్ల బడ్జెట్‌తో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి..  మిగతా కులాలకు 100 కోట్లు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు.   ఏపీ బీసీ సంఘం నాయకులు బత్తుల లక్ష్మయ్య, తమ్మిశెట్టి ప్రసాద్, చక్రవర్తి మాట్లాడుతూ పూర్వ కాలంలో మాదిరిగానే నేటి ప్రభుత్వాలు కూడా బీసీలను అణగదొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

 వెనుకబడిన కులాల ఓట్లతో అధికారం దక్కించుకున్న టీడీపీ..ఇప్పుడే వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని చెప్పారు. అనంతరం పాత బస్టాండ్‌ సమీపంలోని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో వీఆర్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజినేయులు, ప్రధాన కార్యదర్శి  వెంకన్న, నాయకులు  దేవేంద్రప్ప, ఆంజనేయులు, బీసీ మాదన్న,భాగ్యలక్ష్మి   తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement