టీడీపీలో విస్త'రణం' ప్రకంపనలు | Sakshi
Sakshi News home page

టీడీపీలో విస్త'రణం' ప్రకంపనలు

Published Sat, Apr 1 2017 3:19 PM

టీడీపీలో విస్త'రణం' ప్రకంపనలు - Sakshi

అమరావతి: ఆశావహుల మధ్య ఏపీ మంత్రివర్గ విస్త‘రణం' ముమ్మరమైంది. పదవులపై నేతల అసంతృప్తులు, అలకలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్‌ఆర్‌ జిల్లా పదవులు పంచాయితీ మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. వైఎస్‌ఆర్‌ జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి...పదవి రేసులో ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే జిల్లా టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డి, మేడ మల్లికార్జునరెడ్డి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. మేడ మల్లికార్జునరెడ్డి, లింగారెడ్డి, రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్‌లతో ఆయన భేటీ అయ్యారు.

రామసుబ్బారెడ్డకి ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు బుజ్గించేందుకు యత్నించారు. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి అవసరం లేదని, ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. అయితే దీనిపై జిల్లా నేతలకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి అవకాశం ఇవ్వాలని రామసుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపడేవిధంగా నిర్ణయాలు జరగాలన్నారు.

ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవిపై రామసుబ్బారెడ్డిని  విలేకరులు  ప్రశ్నించగా, దీనిపై సీఎం పిలిచి అడిగినప్పుడు తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవి వద్దని తాను గతంలోనే సీఎంకు చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరుతున్న సమయంలో కూడా తమ నిర్ణయం చెప్పామని, అయితే సీఎం అన్ని తాను చూసుకుంటానన్నారని తెలిపారు. తమ గౌరవంతో పాటు కార్యకర్తలు ఇబ్బందిపడకుండా చూడాలని ఆరోజే ముఖ్యమంత్రికి చెప్పామన్నారు. 

మరోవైపు జిల్లా నేత మేడా మల్లికార్జున రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయన ఇవాళ సీఎంను కలిసి కేబినెట్‌లో తనకు స్థానం కల్పించాలని కోరారు. భేటీ అనంతరం మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ...మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను కోరారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిరాయింపుదారులకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. పార్టీ టికెట్‌పై గెలిచినవారికే మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఇక మంత్రివర్గ కూర్పుపై ఇవాళ రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement