ఆర్‌బీఐ చెబితేనే రీషెడ్యూల్ | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ చెబితేనే రీషెడ్యూల్

Published Tue, Jul 1 2014 2:34 AM

AP CM asks banks to reschedule crop loans

* రుణాల రీషెడ్యూలుపై చంద్రబాబుకు బ్యాంకర్ల స్పష్టీకరణ
 
సాక్షి, దరాబాద్: ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ విజ్ఞప్తి చేసినా మాఫీ మాటను దాటవేసి, రీషెడ్యూల్ రాగమే వినిపించారు. రుణాల తిరిగి చెల్లింపులు లేకపోవటంతో బ్యాంకులు సక్రమంగా పనిచేయలేకపోతున్నాయని, రైతులు రుణాలు చెల్లించకపోతే ఖరీఫ్ రుణాలు ఇవ్వలేమని ఎస్‌ఎల్‌బీసీ భేటీలో బ్యాంకర్లు స్పష్టంచేసినా.. ఆ రుణాలను రీషెడ్యూల్ చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు తప్పితే మాఫీపై స్పష్టత ఇవ్వలేదు.

రుణాలను రీషెడ్యూలు చేయాలంటే భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతి అవసరమని బ్యాంకర్లు చెప్తే.. రీషెడ్యూలు చేయాల్సిందిగా తీర్మానం చేసి ఆర్‌బీఐకి పంపించాలని చంద్రబాబు సూచించారు కానీ.. మాఫీకి తమ ప్రణాళిక ఏమిటో చెప్పలేదు. పైగా.. రుణాలు రీషెడ్యూలు చేశాక వాటిపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని, తిరిగి చెల్లించానికి 3 నుంచి 7 ఏళ్ల గడువు ఇవ్వాలనీ చంద్రబాబు కోరటం విశేషం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలని సీఎం విజ్ఞప్తి చేయగా.. బ్యాంకర్ల నుంచి సానుకూల స్పందన రాలేదు. రుణాలు రీషెడ్యూలు చేయడానికి ఆర్‌బీఐ అనుమతి అవసరమని, ప్రభుత్వ విజ్ఞప్తిని ఆర్‌బీఐకి నివేదించి అక్కడ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని బ్యాంకర్లు సమాధానం ఇచ్చారు.

మాఫీ కంటే రీ షెడ్యూల్‌పైనే దృష్టి...
రైతుల రుణ మాఫీ ఎలా అమలు చేయనున్నారన్న అంశంకన్నా ప్రభుత్వం రుణాల రీషెడ్యూలుపైనే భేటీలో బాబు ప్రధానంగా దృష్టిపెట్టారు! కరువు, తుపాన్లు వచ్చిన 90 రోజుల్లోగా రుణాలు రీషెడ్యూలు చేయాలనే నిబంధనను పరిగణనలోనికి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ని 113 కరువు, 462 తుపాను బాధిత మండలాలతో పాటు మిగతా 86 మండలాల్లోనూ రుణాల రీషెడ్యూలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

దీన్ని ఆర్‌ఐ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని ఆర్‌బీఐ ప్రాంతీయ డెరైక్టర్ కె.ఆర్.దాస్ చెప్పా రు. నిర్ణీత గడువు తర్వాత రీషెడ్యూలు చేస్తే బ్యాంకులకు ఇ బ్బందులు ఉంటాయన్నారు. రుణాల రీషెడ్యూలుపై నిర్ణ యం వచ్చే వరకు కొంత సమయం పడుతుందని, ఆలో గా రైతులు రుణాలు చెల్లించి తాజా రుణాలు పొందాలని, రుణా లు చెల్లించిన వారికీ మాఫీ వర్తిస్తుందని ప్రకటన చేయాలని బాబుకు ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ రాజేంద్రన్ విజ్ఞప్తి చేశారు.
 
రుణాల చెల్లింపు 3-7 ఏళ్ల గడువివ్వండి...
రుణమాఫీ హామీ అమలుకు కట్టుబడ్డామని చంద్రబాబు అన్నారు. ‘‘రుణాలు సకాలంలో చెల్లించిన వారీకీ మాఫీ వర్తింపజేస్తాం. బంగారంపై తీసుకున్న రుణాలు రద్దు చేస్తాం. రుణాలు చెల్లించడానికి రైతులు సిద్ధమైతే సంతోషం. లేదంటే బలవంతంగా వసూలు చేయడానికి బ్యాంకులు చర్యలు చేపట్టకుండా సంయమనం పాటించాలి. హామీ అమలుకు ఏదో మార్గం కనుగొంటాం. ముందు రీషెడ్యూలు చేస్తే బ్యాంకుల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. తర్వాత ఏదొకటి చేస్తాం’’ అని విజ్ఞప్తి చేశారు. రీషెడ్యూలు చేసిన తర్వాత ఏడాది పాటు రుణాల వసూళ్ల మీద మారిటోరియం ఉండాలని, రుణాలు తిరిగి చెల్లించడానికి 3 నుంచి 7 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరారు.
 
ఏపీ వార్షిక రుణ ప్రణాళిక రూ. 91,459 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 91,459 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఖరారు చేసింది. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ. 77,894 కోట్లు కేటాయించారు.  వ్యవసాయ రుణాల కింద మొత్తం రూ. 56,019 కోట్లు కేటాయించారు. ఇందులో స్వల్పకాలిక రుణాల కింద రూ. 41,978 కోట్లు, టర్మ్ లోన్స్, వ్యవసాయ అనుబంధ రుణాల కింద రూ. 14,041 కోట్లు కేటాయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement