యువశక్తి సద్వినియోగంతోనే దేశాభివృద్ధి | Sakshi
Sakshi News home page

యువశక్తి సద్వినియోగంతోనే దేశాభివృద్ధి

Published Fri, Oct 25 2019 3:35 AM

Ap Cm Jagan Mohan Reddy To Launch Cipet Buildings At  Amravati - Sakshi

సాక్షి, అమరావతి: ప్లాస్టిక్‌ పరిశ్రమ, పరిశోధన రంగాల్లో అత్యధికంగా ఉన్న ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. యువశక్తిని సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. 9.30 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశ ప్లాస్టిక్‌ పరిశ్రమ విలువ 2025 నాటికి 340 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సురంపల్లిలో సంయుక్తంగా నిర్మించిన ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, సెంటర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ (సీపెట్‌–సీఎస్‌టీఎస్‌) నూతన భవనాన్ని గురువారం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సీపెట్‌ పారిశ్రామిక ఆవిష్కరణల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రంగంలో పరిశోధనలు, ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించేందుకు దేశంలో త్వరలో కొత్తగా మరో అయిదు సీపెట్‌ కేంద్రాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ప్లాస్టిక్‌ కాలుష్య నివారణ దిశగా పరిశోధనలను విస్తృతం చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ సవాల్‌ను ఎదుర్కొంటామని చెప్పారు.

ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినతి మేరకునెల్లూరు జిల్లా నాయుడుపేటలో మరో ‘సీపెట్‌’ను నెలకొల్పుతామని కేంద్ర మంత్రి సదానందగౌడ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్‌ అందించిన సహకారం అభినందనీయమని, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాగునీరు, పట్టణాభివృద్ధి, సుందరీకరణ తదితర రంగాల్లో అభివృద్ధికి తమ శాఖ పూర్తిగా సహకరిస్తుందన్నారు.

యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం  
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో మన రాష్ట్రం మాత్రమే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిందని చెప్పారు.తగిన శిక్షణ పొందిన యువతను పారిశ్రామికరంగానికి అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

అందుకే యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం భుజానికెత్తుకుందని వివరించారు. ఇందులో భాగంగా అన్ని పరిశ్రమల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా యువతకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరారు. రానున్న రోజుల్లో సీపెట్‌ వంటి మరిన్ని సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలతో సీపెట్‌ అనుసంధానమై ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సహకరించాలన్నారు.

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ వైజాగ్‌ – కాకినాడ – బందర్‌ పెట్రో కారిడార్‌ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని, రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి పి.రాఘవేంద్రరావు, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, రక్షణ నిధి, మొండితోక జగన్మోహనరావు, కైలే అనిల్‌ కుమార్, సీపెట్‌ విజయవాడ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌తో సదానందగౌడ భేటీ
సీపెట్‌ భవనాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి డీవీ సదానందగౌడ తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను మర్యాద పూర్వకంగా తన నివాసంలోకి ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. మధ్యాహ్నం 12.31 గంటలకు వచ్చిన కేంద్ర మంత్రి అక్కడ గంటపాటు గడిపారు. సీఎం ఆతిథ్యం స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.  

Advertisement
Advertisement