మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్‌తో ఒప్పందం | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్‌తో ఒప్పందం

Published Tue, Dec 9 2014 1:17 AM

మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్‌తో ఒప్పందం - Sakshi

* ఎంఓయూపై ఇరు ప్రభుత్వాల సంతకాలు
* ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్ రూపకల్పన పూర్తిచేయాలని లక్ష్యం
* రాష్ట్ర అధికారులకు శిక్షణనిస్తామన్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్  

 
 సాక్షి, హైరదాబాద్: రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే బాధ్యతను సింగపూర్ ప్రభుత్వానికి అప్పగిస్తూ.. ఆ దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ఖరారు చేసుకుంది. దీనికి సంబంధించిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ల సమక్షంలో సంతకాలు చేశారు. రాష్ట్రానికి సింగపూర్ లాంటి రాజధాని నగరాన్ని నిర్మిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని.. ఆ మేరకు రాజధాని నిర్మాణానికి అనుసరించాల్సిన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సింగపూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒప్పందం మీద సంతకాలు పెట్టడంతో రాజధానికి సంబంధించిన పని ప్రారంభమైనట్లేనన్నారు. ఒప్పందంపై సంతకాల అనంతరం సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రాథమికంగా 8 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించిన ప్రణాళికను సింగపూర్ తయారు చేస్తుంది.
 
 ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని గడువు పెట్టుకున్నాం. మాస్టర్ ప్లాన్ తయారయిన తర్వాత.. రాజధాని నిర్మాణానికి ‘సవివర కార్యాచరణ ప్రణాళిక’ తయారు చేస్తాం. రెండు ప్రభుత్వాల మధ్య రోజువారీ వ్యవహారాలను చూడటానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నాం. కార్యాచరణ ప్రణాళిక తయారయిన తర్వాత.. దాని అమలు కోసం కొన్ని కంపెనీలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీలు)ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సింగపూర్ కంపెనీలూ నిర్మాణంలో పాలుపంచుకుంటాయి. కొన్ని కంపెనీలతో సంయుక్త భాగస్వామ్య సంస్థ (జాయింట్ వెంచర్)లను ఏర్పాటు చేసి పనులు అప్పగించనున్నాం. రాజధాని వ్యవహరాలను పర్యవేక్షించడానికి నా అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ కూడా ఉంటుంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) బిల్లును రానున్న శీతాకాల సమావేశాల్లో శాసనసభలో ప్రవేశపెడతాం’’ అని సీఎం వివరించారు.
 
 మా నైపుణ్యం ఉపయోగపడుతుంది: ఈశ్వరన్
 పట్టణీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, టౌన్‌షిప్‌ల నిర్మాణంలో తమకున్న అనుభవం ఏపీ రాజధాని నిర్మాణ ప్రాజెక్టుకు ఉపయోగపడుతుందని ఈశ్వరన్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్న ఆంధ్రప్రదేశ్ అధికారులకు సింగపూర్‌లో శిక్షణ ఇస్తామన్నారు. రాజధాని నిర్మాణం ప్రాజెక్టు. వ్యయం గురించి ఇప్పటికిప్పుడు ఇంత అని చెప్పలేమన్నారు. ఈశ్వరన్‌ను బాబు పలుమార్లు ‘హిజ్ ఎక్స్‌లెన్సీ’ అని సంబోధించారు. తనకోసం ఏర్పాటు చేసిన సీట్లో బలవంతంగా కూర్చోబెట్టారు!

Advertisement
Advertisement