జలం వర్షించే.. పొలం హర్షించే | Sakshi
Sakshi News home page

జలం వర్షించే.. పొలం హర్షించే

Published Sun, Sep 1 2019 5:07 AM

AP government that effectively mitigated the flood waters of the rivers Krishna and Godavari and Vamsadhara - Sakshi

సాక్షి, అమరాతి: కృష్ణా, గోదావరి, వంశధార జలాలను ఒడిసి పట్టి.. ఆయకట్టు చివరి భూములకు సైతం నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. రాష్ట్రంలో భారీ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) కింద ప్రస్తుత నీటి సంవత్సరంలో 87,62,037 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. మూడు నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు శుక్రవారం వరకూ 20,62,891 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 9.87 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేయడం గమనార్హం. ఈ ఏడాది సెపె్టంబర్‌ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టుకు నీటిని అందించడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందించేలా యాజమాన్య పద్ధతులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించిన దాఖలాలు లేవు. 

గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో కృష్ణా, గోదావరి, వంశధార పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. మూడు నదుల్లోనూ నీటి లభ్యత భారీగా పెరిగింది. ప్రధానంగా కృష్ణా నది వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు ప్రభుత్వం తరలించింది. పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. గోదావరి కుడిగట్టుపై తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు, ఎడమ గట్టుపై పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా వరద నీటిని ఒడిసి పడుతున్నారు. వంశధార, నాగావళి నదుల వరద జలాలను తోటపల్లి, నారాయణపురం, గొట్టా బ్యారేజీల్లో నిల్వ చేశారు. 

సమర్థవంతంగా నీటి పంపిణీ  
రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిని వృ«థా కానివ్వకుండా, సమర్థవంతమైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టుకు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు జూన్‌ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాకు జూన్‌ రెండో వారంలోగానే సాగునీరు విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ కింద ఉన్న ఆయకట్టుకు జూన్‌ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తోటపల్లి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద ఆయకట్టుకు జూన్‌ మొదటివారంలో నీటిని విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు జూన్‌ రెండో వారం నుంచి నీరు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల కింద ఆయకట్టుకూ జూన్‌ రెండోవారంలో నీటిని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు.  

కృష్ణా బేసిన్‌లో సాగు జోరు  
శ్రీశైలం, సాగర్‌ రిజర్వాయర్లలో నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. సాగర్‌ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు ఆగస్టు 11న.. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లకు ఆగస్టు 7న, హంద్రీ–నీవాకు ఆగస్టు 6న నీటిని విడుదల చేశారు. ఎస్సార్‌బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు సెపె్టంబర్‌ మూడో వారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చెరువులు నింపి, కొంత భాగం ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టుకు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది పంటల దిగుబడి భారీగా పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  

Advertisement
Advertisement