టీడీపీ పతనం ప్రారంభమైంది: పార్థసారధి | Sakshi
Sakshi News home page

టీడీపీ పతనం ప్రారంభమైంది: పార్థసారధి

Published Thu, Jul 27 2017 6:30 PM

టీడీపీ పతనం ప్రారంభమైంది: పార్థసారధి - Sakshi

విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో దొంగలను పట్టుకునే దమ్ము టీడీపీ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి వ్యాఖ్యానించారు. మహిళలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మల్లాది విష్ణుతో పాటు వందలాది మంది ఆయన అనుచరులు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

అనంతరం పార్థసారధి మాట్లాడుతూ.. ‘నేడు చాలా సంతోషకరమైన రోజు. దివంగత నేత వైఎస్ఆర్ గారి ప్రియ శిష్యుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరిక పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుంది. పార్టీ బలోపేతానికి మల్లాది విష్ణు కృషి చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్లీనరీతో టీడీపీ పతనం ప్రారంభమైంది. టీడీపీ అరాచక పాలనకు ఎప్పుడు సమాధి కడదామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఐపీఎస్ అధికారిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసినా, మహిళలపై దాడులు చేసినా పట్టించుకోని టీడీపీది చేతకాని ప్రభుత్వమని’  విమర్శించారు.

టీడీపీ అరాచక పాలన గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ‘మా పెన్షన్ తీసుకుంటున్నారు, మా రోడ్లపై నడుస్తున్నారు.. మాకు ఓట్లేయకపోతే కష్టాలు తప్పవంటూ’ ప్రజలపై సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడే బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ ఎంత చేశారో, ఎంత మందికి పెన్షన్లు తీసివేశారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. డెంగ్యూ జ్వరాలతో ప్రజలు చనిపోతున్నా, కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. అభివృద్ధి పేరు చెప్పుకుని రియల్ ఎస్టేట్ కు భూములు కట్టబెట్టడం నిజం కాదా అని ఈ సందర్భంగా పార్థసారధి ప్రశ్నించారు.

 

Advertisement
Advertisement