నదీముఖ రాజధానిపై పునరాలోచన! | Sakshi
Sakshi News home page

నదీముఖ రాజధానిపై పునరాలోచన!

Published Fri, Oct 17 2014 2:35 AM

నదీముఖ రాజధానిపై పునరాలోచన! - Sakshi

తుపాను బీభత్సం నేపథ్యంలో సర్కారు తర్జనభర్జనలు
విశాఖ నగరం దెబ్బతిన్న తీరుపై దృష్టి
కృష్టా నదికి గతంలో వచ్చిన భారీ వరదలు పరిగణనలోకి..
ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు
ప్రభుత్వ పెద్దల ముందు అధికారుల తాజా ప్రతిపాదనలు
మళ్లీ తెరపైకి నూజివీడు, విజయవాడ-ఏలూరు మధ్య ప్రాంతం

 
హైదరాబాద్: నదీముఖ రాజధాని (రివర్ వ్యూ) నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. అన్ని విధాలా లాభనష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయానికి రావాలని భావిస్తోంది. హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో రాజధాని నిర్మాణంపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం ైవె కుంఠపురం నుంచి తాడేపల్లి మండలం సీతానగరం వరకు, కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మొదలుకుని కంచికచర్ల వరకు కృష్ణా నదీ ముఖంగా రాజధాని నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు పలు సమీక్షా సమావే శాలు నిర్వహించారు. చివరకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సమీకరణ చేపట్టాలని  నిర్ణయించింది. ఇందుకోసం కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడింది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో రాజధాని విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలిసింది.

సముద్రానికి అంచున ఉండటం, గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో విశాఖ నగరానికి తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలింది. పరిశ్రమలు మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తిరిగి పూర్వ స్థితికి చేరుకోవాలంటే కనీసం రెండు, మూడు సంవత్సరాలు పట్టొచ్చని అధికారులు అంటున్నారు. కాగా ప్రస్తుతం రాజధాని నిర్మాణాన్ని సంకల్పించిన ప్రాంతంలో సైతం భారీ వరదలకు ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరించడంతో, ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యుడొకరు చెప్పారు.


 గతాన్ని ప్రస్తావిస్తున్న నిపుణులు
 కృష్ణా నదీ ముఖ రాజధాని నిర్మాణానికి పరిస్థితులు అనుకూలం కాదని పలువురు నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ ఈ ప్రాంతంలోనే నిర్మించాలని భావిస్తే ఉధృతమైన వరదలను సైతం తట్టుకునే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, ఇందుకు అనుకున్నదానికన్నా రెండింతల ఖర్చు అవుతుందన్న అభిప్రాయం ఉంది. గత చరిత్రను పరిశీలిస్తే కృష్ణా నదికి ప్రతి 20 లేదా 30 సంవత్సరాలకు ఒకసారి ఉధృతంగా వరదలు వస్తుంటాయి. 2009 సెప్టెంబర్ తొలి వారంలో కృష్ణా బ్యాక్ వాటర్ వల్ల కర్నూలు నగరం మునిగిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రస్తుతం రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్న ైవైకుంఠపురం నుంచి కంచికచర్ల వరకు కృష్ణా నదికి చేరువగానే ఉంటారుు. దీనివల్ల ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. విజయవాడ, ఏలూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా సురక్షితమని వారు చెప్పినట్లు సమాచారం. కృష్ణా జిల్లా నూజివీడు అయితే అటు విజయవాడ, ఇటు ఏలూరుకు మధ్యలో ఉంటుందని కొందరు రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రివర్గం ఉపసంఘానికి తెలిపినట్టు తెలిసింది.

 

నూజివీడు విజయవాడకు 44 కిలోమీటర్లు, ఏలూరుకు 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమట్టానికి 88 మీటర్ల(288 అడుగులు) ఎత్తులో ఉంది. అదే మంగళగిరి 43 మీటర్లు(141 అడుగులు), విజ యవాడ 23 మీటర్లు (75 అడుగులు), అమరావతి 36 మీటర్లు(118 అడుగులు) ఎత్తులోనే ఉంటాయని, అందువల్ల నూజివీడు అనువైందని వివరించినట్లు సమాచారం. గతంలో వరదలు వచ్చినపుడు విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలోకి, పక్కనే ఉన్న రింగ్‌రోడ్‌లోకి నీరు రావటం, తుమ్మలపాలెం, పరిటాల, కంచికచర్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడటం, కీసర వద్ద అప్రోచ్ బ్రిడ్జి కూలిపోవటాన్ని వారు ప్రస్తావించినట్లు తెలిసింది.

 

తుపాను, వరదలు ఒకేసారి రావడం, సముద్రం ఆటుపోట్లకు గురైన సమయంలో ఒకవేళ నీటిని కృష్ణా నది నుంచి విడుదల చేసినా సముద్రంలో కలవకుండా వెనక్కు వచ్చే ప్రమాదముందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పురపాలక శాఖ పరిధిలోని డెరైక్టర్ ఆఫ్  టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గతంలో రాజధాని విషయంలో తయారు చేసిన ఒక నివేదికను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. దీనిలో విశాఖపట్నం రాజధానిగా అనువైంది కాదని, కర్నూలు జిల్లా  రాయలసీమకు మధ్యలో లేదని, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల అంత వేగంగా అభివృద్ది చెందదని, గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతం అనువైనది అయినా రాష్ట్రంలోని నలుమూలలకు రోడ్డు కనెక్టివిటీ లేదని పేర్కొన్నారు.
 
 వరదలను అడ్డుకుంటే ఇబ్బంది ఉండదు: శ్రీధరన్


 తుపానులు, వరదలు వంటివి నదీ ముఖ రాజధానికి పెద్ద సమస్య కాదని పట్టణ నిర్మాణ రంగ నిపుణులు, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంచాలకులు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.శ్రీధరన్  తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఆమ్‌స్టర్‌డామ్, బాన్ తదితర నగరాలు నదులకు ఆనుకునే ఉన్నాయని తెలిపారు. భారీ వర్షాల వల్ల వచ్చే వరదలు, ఆకస్మిక వరదలు వంటి వాటిని తట్టుకునే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement