రాజధాని నిర్మిస్తాం... డబ్బులివ్వండి | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మిస్తాం... డబ్బులివ్వండి

Published Mon, Aug 4 2014 2:45 AM

డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి విరాళ సేకరణకు ముద్రించిన రశీదు - Sakshi

* డ్వాక్రా సంఘాల నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున వసూలుకు యత్నాలు
* పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల నుంచి సీఎం చేతికి చేరిన చెక్కులు

 
సాక్షి విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణం బాధ్యతను తాము చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పేరుతో ప్రజలు, వివిధ సంఘాల నుంచి విరాళాల వసూళ్ల జోరుపెంచింది. ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున వసూలు చేసే కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వుందని చెబుతూ రుణమాఫీ లాంటి ఎన్నికల హామీలను కూడా సీఎం వాయిదా వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

ఈ నినాదంతో రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరించే పనిలోపడ్డారు. చంద్రబాబు పర్యటనల సందర్భంగా జిల్లాల్లోని డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చే వ్యవహారాల బాధ్యతలను డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్లు గ్రామైక్య సంఘం అధ్యక్షురాళ్లకు అప్పగించారు. రాష్ట్రంలో  6,51,000 డ్వాక్రా సంఘాలు ఉండగా, ఇందులో 65 లక్షల 10 వేలమంది సభ్యులు వున్నారు. వీరిలో ఒకొక్కక్కరి నుంచి రూ.20 మొదలు రూ.50 వరకూ వసూలుచేసి చెక్కు రూపంలో సీఎం చేతికి అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సీఎం రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆ జిల్లా డ్వాక్రా సంఘాల సభ్యులు రాజధాని నిర్మాణం కోసం పేరుతో  రూ.62 లక్షలు చంద్రబాబుకు అందించారు. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆ జిల్లా డ్వాక్రా సంఘాల సభ్యులు రూ.కోటి చెక్కు సీఎంకు అందించారు. ఆ జిల్లాలోని 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యుల్లో ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున తీసుకుని ఈ మొత్తం సేకరించారు.

తమకు మాట మాత్రమైనా చెప్పకుండా  గ్రామైక్య సంఘాల అధ్యక్షురాళ్లు ఈ డబ్బులు చెల్లించారని కొందరు సభ్యులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇదే తరహాలో కర్నూలు జిల్లాలో రూ.కోటికి పైగా వసూలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రశీదులు డ్వాక్రా సంఘాలకు చేరాయి. ఈ రకమైన విరాళాలు అందించేందుకు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సంఘాల సభ్యుల మీద ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
‘బాబు’ బాటలోనే విజయవాడ మేయర్!
రాష్ర్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పుకుంటూ తమ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న వ్యవహారాన్ని స్ఫూర్తిగా తీసుకున్న విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ కూడా ఇదే బాట పట్టారు. కొర్పొరేషన్ రూ.500 కోట్ల అప్పుల్లో ఉందనీ, ఆర్థిక సహాయం అందించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రిక్తహస్తాలు ఎదురయ్యే సంకేతాలు కనిపించాయని ఆయన చెబుతున్నారు.

రాజధాని నిర్మాణం కంటే ముందు నగరాభివృద్ధి ముఖ్యమనీ అందువల్ల నగరవాసులు విరాళాలు అందజేయాలని ఇటీవల నిర్వహించిన బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదనీ ఇందుకు సుమారు రూ.48 కోట్లు, కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపునకు రూ.20 కోట్లు ఇవ్వాల్సి ఉందని, నిధుల కొరత వల్ల వాహనాలకు డీజిల్ కూడా కొట్టించే పరిస్థితి లేదంటూ ఆయన ఏకరువు పెడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement