మున్సిపాలిటీల్లో చార్జీల మోత! | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో చార్జీల మోత!

Published Thu, Jan 29 2015 3:54 AM

మున్సిపాలిటీల్లో చార్జీల మోత!

* పెరగనున్న నీటి, పారిశుధ్య చార్జీలు, ఆస్తి పన్ను
* ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
* యూజర్ చార్జీలు, పరోక్ష పన్నుల వాత

 
 సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో నీటి, పారిశుధ్య చార్జీలతో పాటు ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. అయితే చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కాకుండా.. ఆయా మున్సిపాలిటీలే నిర్ణయం తీసుకున్నట్టుగా బయటకు తెలియజేయాలనే వ్యూహంలో ఉంది. మున్సిపాలిటీల్లో చాలా సంవత్సరాలుగా ఆస్తి పన్ను, నీటి చార్జీలను పెంచలేదని, ప్రస్తుతం మంచినీటి పథకాలు, పారిశుధ్య నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
 
 ఈ వ్యయాన్ని ప్రభుత్వం భరించకుండా ఆయా మున్సిపాలిటీలే ఆదాయాన్ని సమకూర్చుకుని భరించాలనేది ప్రభుత్వ యోచనగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మంచినీటి పథకాల నిర్వహణకు అయ్యే పూర్తి వ్యయాన్ని నీటి చార్జీల పెంపు ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం మున్సిపాలిటీలకు సూచిస్తోంది. అలాగే పారిశుధ్య నిర్వహణకయ్యే వ్యయాన్ని కూడా చార్జీల రూపంలో ప్రజల నుంచి రాబట్టాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇలావుండగా వచ్చే బడ్జెట్‌కు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో భాగంగా అదనపు ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
 
 ఇందులో భాగంగా పరోక్షంగా పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వం అందించే ప్రతి సేవకు యూజర్ చార్జీలను వసూలు చేయాలని బడ్జెట్ తయారీ సర్క్యులర్‌లో ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఏ ఏ రంగాల్లో పరోక్ష పన్నులను యూజర్ చార్జీల రూపంలో ఎలా రాబట్టుకోవచ్చనే అంశంపై కేపీఎంజీ కన్సల్టెన్సీ ప్రతినిధులు బుధవారం ఆర్థిక శాఖ అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి సూచనలకు అనుగుణంగా అధికారులు వచ్చే బడ్జెట్‌లో పరోక్ష పన్నుల ఆదాయ మార్గాలను పేర్కొననున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థానిక సంస్థలు పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం ఎలాగ రాబట్టుకుంటున్నదీ కేపీఎంజీ సంస్థ ఆర్థిక శాఖకు వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement