ఆరిపోతున్న ఆరోగ్యశ్రీ దీపం | Sakshi
Sakshi News home page

ఆరిపోతున్న ఆరోగ్యశ్రీ దీపం

Published Sun, Nov 25 2018 1:14 PM

AP Govt Withdraws 'NTR Vaidya Seva'  For Poor - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించిన ఆరోగ్యశ్రీ దీపం ప్రస్తుత టీడీపీ పాలనలో ఆరిపోయే దశకొచ్చింది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ) జాబితాలో వైద్యమందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడమే దీనికి కారణం.

గత నాలుగు నెలల్లో రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలే చెబుతుండటం గమనార్హం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను ఆపేశాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే డిసెంబర్‌ 9 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామని ఏపీ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్, ఏపీ సూపర్‌స్పెషాలిటీస్‌ అసోసియేషన్‌లు సర్కారుకు అల్టిమేటం జారీ చేశాయి. 


పేద రోగులపై ఆంక్షల దాడి
మరోవైపు ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం విధించిన ఆంక్షలతో పేద రోగులు అల్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లినవారు మూడు నెలలపాటు రేషన్‌ సరుకులు తీసుకోకపోతే వారిని ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు పొందినవారికి ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కార్డులు లేవు.

ఆయా కార్డులకు అనుమతి తీసుకోవాలన్నా అవకాశం ఉండటం లేదు. ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వెళుతున్న బాధితులకు వైద్యమందించడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ రేట్లు తక్కువగా ఉండటంతో వైద్యం అందించలేమని చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీకే కాకుండా ఈహెచ్‌ఎస్‌ (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌)కు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని ఆస్పత్రి యాజమాన్యాలు వాపోతున్నాయి.

రోజూ వందలాది మంది ఉద్యోగులు వైద్యానికి వస్తున్నా నగదురహిత వైద్యం చేయడానికి ఆస్పత్రులు అంగీకరించడం లేదు. ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 35 లక్షల మంది పైనే సర్కారు తీరుతో వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు.


దశలవారీగా చెల్లిస్తాం 
గత కొంత కాలంగా ఆస్పత్రుల యాజమాన్యాలు బకాయిలు చెల్లించాలని కోరుతున్నాయి. కార్డియాలజీ, ట్రామా కేసులు ఎక్కువ పెండింగ్‌లో ఉన్నాయి. దశలవారీగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తాం. తద్వారా సేవలకు విఘాతం కలగకుండా చూస్తాం.
– డా.ఎన్‌.సుబ్బారావు, 
ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి సీఈవో  

Advertisement

తప్పక చదవండి

Advertisement