Sakshi News home page

ఏపీ హైకోర్టు ఇప్పట్లో లేనట్లే

Published Tue, Jul 8 2014 3:17 AM

AP High Court there is no consensus

ఏర్పాటుకు కొంతసమయం పడుతుంది  స్పష్టంచేసిన కేంద్ర హోంశాఖ    
 
ఆ హైకోర్టును రాష్ట్రపతి నోటిఫై చేయాలి
అప్పటివరకు హైకోర్ట్ ఎట్ హైదరాబాదే ఉమ్మడి హైకోర్టు
హైకోర్టు ధర్మాసనానికి కేంద్ర హోంశాఖ నివేదన
జస్టిస్ నర్సింహారెడ్డి ధర్మ సందేహంపై వాదనలు పూర్తి
తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని, ఆ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటై, దానిని రాష్ట్రపతి నోటిఫై చేసేంతవరకు హైకోర్ట్ అట్ హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు స్థలం గుర్తించడం, సిబ్బందిని గుర్తించడం, పోస్టులను సృష్టించడం, ఆ తరువాత కిందిస్థాయి న్యాయవ్యవస్థను విభజించడం జరుగుతుందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే న్యాయశాఖ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగిందని, సుప్రీంకోర్టును సంప్రదించి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు ఉమ్మడి హైకోర్టుకు రెండు రాష్ట్రాలపై న్యాయ పరిధి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఖరని తెలిపింది.

తెలంగాణలో ఏర్పాటైన హైకోర్ట్ ఎట్ హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్టంపై ఎటువంటి న్యాయపరిధి ఉండదంటూ రాష్ట్ర పునర్ విభజన చట్టంలో స్పష్టం చేసిందని, అందువల్ల ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సంబంధించిన కేసులను విచారించే న్యాయ పరిధి ఉందా..? లేదా..? అన్న అంశంపై జస్టిస్ నర్సింహారెడ్డి ఇటీవల సందేహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ, హైకోర్టుకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేస్తూ, ఈ కేసులో కోర్టు సహాయకారిగా సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్‌ను నియమించారు. తరువాత ఈ కోర్టు ధిక్కార కేసును ప్రధాన న్యాయమూర్తి తన నేతృత్వంలోని ధర్మాసనానికి బదలాయించుకుని గతవారం విచారణ చేపట్టారు.

తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేసుపైనే సుదీర్ఘ వాదనలు జరిగాయి.న్యాయపరిధికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ఈ ఏడాది మే నెలలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖను ధర్మాసనం ముందుంచింది. అందులోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం, వాటిని రికార్డ్ చేసుకుంది.

అంతకుముందు ఈ కేసులో అమికస్ క్యూరీ రవిచందర్ వాదనలు వినిపిస్తూ, హైకోర్ట్ ఎట్ హైదరాబాద్‌కు ఇరు రాష్ట్రాలపై న్యాయపరిధి ఉన్నట్లుగా పునర్ విభజన చట్టంలోని సెక్షన్లను అన్వయించుకోవాలన్నారు. పునర్ విభజన చట్టాన్ని పార్లమెంట్ ఏ ఉద్దేశంతో చేసిందో ఆ ఉద్దేశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతేకాక కేంద్ర హోంశాఖ లేఖను దాని అభిప్రాయంగానే భావించాలి తప్ప, ఉత్తర్వులుగా భావించడానికి వీల్లేదని తెలిపారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement