మలి విడతలోనూ మాఫీ మాయ! | Sakshi
Sakshi News home page

మలి విడతలోనూ మాఫీ మాయ!

Published Mon, Mar 30 2015 2:55 AM

AP Loan Waiver Second Phase List  Maya

సరుబుజ్జిలి మండలం కొత్తకోట గ్రామానికి చెందిన సురవరపు కృష్ణారావు 2013లో పాలకొండ స్టేట్ బ్యాంకులో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. మొదటి విడత రుణమాఫీ జాబితాలో పేరు లేకపోవడంతో ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించారు. ఇతని పేరు మీద పాలకొండ మండలం డోలమాడ పంచాయతీకి చెందిన తాడేలు సుగణాకరరావు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు నమోదు కావడంతో మాఫీ వర్తించలేదని నివేదిక వచ్చింది. దీంతో తహశీల్దారు కార్యాలయంలో మళ్లీ పూర్తి వివరాలు సమర్పించారు. అలాగే జనవరిలో  కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లోనూ ఫిర్యాదు చేశారు. పది రోజులపాటు ఈ పనులకు తిరగడానికే సరిపోయింది. కాగా ఈ సమస్యను పరిష్కరించినట్లు గత నెలలో లీడ్ బ్యాంకు మేనేజర్ కార్యాలయం నుంచి కృష్ణారావు సెల్‌కు మేసెజ్ అందింది. దీంతో రెండో విడతలో రుణమాఫీ వర్తిస్తుందని ఎదురుచూస్తున్న ఆయనకు చుక్కెదురైంది. ఆన్‌లైన్‌లో పెట్టిన రెండో విడత జాబితాలోనూ ఆయన పేరు లేదు. దీంతో ఆయన లబోదిబోమంటున్నారు.
 
 పాలకొండ: ఒక్క కృష్ణారావే కాదు. జిల్లాలో ఎంతోమంది రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పెట్టిన రెండో విడత రుణమాఫీ జాబితాల్లోనూ మతలబులు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కొర్రీలు, ఆంక్షలతో మాఫీకి అర్హులైన రైతుల జాబితాను కుదిస్తూ వస్తున్న ప్రభుత్వం తాజా జాబితాల్లోనూ అదే విధానాన్ని కొనసాగించింది. మొదటి విడతలో వెలుగు చూసిన లోపాలు, అవకతవకలను సరిచేయకపోగా సాంకేతిక కారణాల సాకుతో రైతులను విడతలవారీగా మోసగిస్తోంది. వాస్తవానికి మొదటి విడతలో రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిగా మాఫీ వర్తింపజేస్తామని, అంతకంటే ఎక్కువ రుణం పొందిన వారికి దశల వారీగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
 
 అయితే మొదటి విడత జాబితాలో అర్హుల జాబితాలో సుమారు 60 వేల మంది రైతుల పేర్లు కనిపించలేదు. బ్యాంకు ఖాతాలకు ఆధార్, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకాల నెంబర్లు సరి పోలలేదన్న కారణాలతో వారి పేర్లు చేర్చలేదని అధికారులు పేర్కొన్నారు. దీనిపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో పేర్లు లేని అర్హుల వివరాలు సేకరించి మలివిడత జాబితాలో చేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు బ్యాంకు సిబ్బంది, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతుల నుంచి సమాచారం సేకరించారు. ఇలా 60 వేల మంది రైతులు వివరాలు సమర్పించగా వారిలో 45 వేల మంది రైతుల పేర్లను పాత కారణాలనే చూపిస్తూ రెండో విడత జాబితాలోనూ చేర్చలేదు.
 
 హడావుడి, కాలయాపనకే..
 రైతుల రుణ ఖాతాలతో ఆధార్, రేషన్ కార్డులు, పాసు పుస్తకాల నెంబర్లు ఆనుసంధానం చేసే విషయంలో ప్రభుత్వం చేసిన హడావుడే పాత తప్పులను సరిదిద్దలేకపోవడానికి కారణమని రెవెన్యూ, బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. కేవలం మూడేమూడు రోజుల సమయం ఇచ్చి తప్పులు సరి చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. దానికి తోడు వెబ్‌సైట్ ఒక్కరోజే ఓపెన్ కావడంతో రైతుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోయామని ఓ బ్యాంకు అధికారి ‘సాక్షి’కి వివరించారు. ఈ విషయాన్ని అప్పట్లోనే ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదిలాఉండగా రుణమాఫీ జాబితాలపై ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ మాఫీ ప్రక్రియను ఆలస్యం చేయాలన్న ఉద్దేశంతోనే తప్పులు సరి చేయకుండానే జాబితాను విడుదల చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల మాటల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

 

Advertisement
Advertisement