నిన్నెవరు నియమించారు..! | Sakshi
Sakshi News home page

నిన్నెవరు నియమించారు..!

Published Sat, Nov 29 2014 2:15 AM

నిన్నెవరు నియమించారు..! - Sakshi

కడప రూరల్: కడప నియోజకవర్గ తెలుగుదేశంలో విభేదాలు మరోసారి బయటపడ్డారుు. సభ్యత్వ నమోదు సందర్భంగా శుక్రవారం నాయకుల మధ్య వాదన చోటుచేసుకుంది. కడప నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నిన్ను ఎవరు నియమించారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్‌రెడ్డి ఇటీవల కడప అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించారు. అసలు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారుగా ఇక్కడకు ఎందుకు వచ్చావని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక దుర్గాప్రసాద్ మౌనం వహించారు.

కడప నగరంలోని సీఎస్‌ఐ గ్రౌండ్‌లో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డితోపాటు జిల్లాకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఫొటో ఉన్న సభ్యత్వ నమోదు కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కడప అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన దుర్గాప్రసాద్ ఫొటో ఉన్న కరపత్రాలను కూడా ఆవిష్కరించారు.

ఈ కరపత్రంలో కడప టీడీపీ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్ అని ఉండడాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.గోవర్దన్‌రెడ్డి చూశారు. టీడీపీ ఇన్‌చార్జిగా ఎవరు నియమించారని దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించారు. పార్టీ కోసం కృషి చేస్తున్నానుగా అనే సమాధానం వచ్చింది. అది సరే.. కడప టీడీపీ ఇన్‌ఛార్జిగా ఎలా వేసుకుంటావని మరోమారు గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.

అసలు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా అనడంతో దుర్గాప్రసాద్ మౌనం వహించారు. తర్వాత అక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి దృష్టికి విషయాన్ని గోవర్ధన్‌రెడ్డి తీసుకెళ్లారు. ఆయన కూడా ఆ  కరపత్రాన్ని చూసి అవును కదా అని అన్నారు. ఇంతలోనే తేరుకుని ఈ విషయాన్ని జిల్లా కార్యాలయంలో మాట్లాడదాం అంటూ సర్దిచెప్పారు. ఈ సన్నివేశం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.

 నిజమే.. జిల్లాలో మేం వీక్ : సతీష్‌రెడ్డి
 జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందని, బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సతీష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉందన్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని టీడీపీలోకి ఆహ్వానించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, అమీర్‌బాబు, బాలకృష్ణ యాదవ్, దుర్గాప్రసాద్, పల్లా రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement