కత్తిమీద సాము! | Sakshi
Sakshi News home page

కత్తిమీద సాము!

Published Wed, Nov 12 2014 2:37 AM

కత్తిమీద సాము!

* నీరుగారుతున్న నీటి నిర్వహణ
* సగానికి పైగా లష్కర్ పోస్టులు ఖాళీ
* మనుగడలో లేని నీటిసంఘాలు
* రబీ వంతుల సమయంలో ఇబ్బందులు
* ఔట్‌సోర్సింగ్‌లోనైనా భర్తీ చేయకుంటే ఇక్కట్లే

అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ షెడ్యూల్ డిసెంబర్ ఒకటిన ఆరంభమై మార్చి 31తో పూర్తి కావాలి. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో మొత్తం ఆయకట్టు 8.89 లక్షల ఎకరాలు. దీనంతటికీ సాగునీరు సరఫరా చేయాలంటే 83 టీఎంసీల నీరు అవసరం. ధవళేశ్వరం బ్యారేజి వద్ద రబీ కాలంలో కేవలం 67 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటుందని అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే.

మిగిలిన 16 టీఎంసీలను ప్రత్యామ్నాయ మార్గాల్లో సేకరించాలి. ఇందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతోపాటు, రైతులు కూడా సకాలంలో సాగు పూర్తి చేయాల్సి ఉంటుంది. డెల్టాలో ఖరీఫ్ సాగు జరిగిన తీరు చూస్తే మార్చి 31 నాటికి రబీ పూర్తి కావడం అసాధ్యం. ఇరిగేషన్ అధికారులు వీటన్నింటినీ పరిశీలించి తొలి రోజుల నుంచి నీటి పొదుపు చర్యలు చేపట్టాల్సి ఉంది. లాకులవారీగా వంతులవారీ విధానం అమలు చేయడం ద్వారా నీటి వృథాను కొంతవరకూ అరికట్టవచ్చని భావిస్తున్నారు.
 
నిర్వీర్యమైన లష్కర్ వ్యవస్థ

వంతులవారీ విధానం మంచిదే. కానీ లాకుల వద్ద నీటి యాజమాన్యం చేయడానికి అవసరమైన లష్కర్ వ్యవస్థ ఇరిగేషన్ శాఖలో నిర్వీర్యమైంది. గోదావరి డెల్టాల పరిధిలో ఉభ య గోదావరి జిల్లాల్లో 1760 మంది లష్కర్లు పని చేయాల్సి ఉండగా, కేవలం 850 మంది మాత్రమే ఉన్నారు. అమలాపురం ఇరిగేషన్ డివి జన్‌లో ఒకప్పుడు 185 మంది లష్కర్లు ఉండగా, ప్రస్తుతం 36మంది మాత్రమే ఉన్నారంటే పరి స్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీ అయిన లష్కర్ పోస్టుల భర్తీని 1986 నుంచి అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం నిలిపివేసింది.

కొన్నాళ్లు కనీసం కారుణ్య నియామకాలైనా జరిగేవి. తరువాత వాటిని కూడా నిలిపివేశారు. ‘ఎవరైనా లష్కర్ రిటైరైనా, మృతి చెందినా ఆ స్థానం ఖాళీగా ఉండిపోతోంది. ఇదిలాగే కొనసాగితే 2020 నాటికి నీటిపారుదల శాఖలో ఐదు శాతం కూడా లష్కర్లు ఉండరు’ అని జిల్లా లష్కర్ల అసోసియేషన్ కార్యదర్శి ఎం.సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
 
నీటి యాజమాన్యంలో వారి పాత్రే కీలకం
కాలువలపై నీటి యాజమాన్యం చేయడంలో లష్కర్ల పాత్ర అత్యంత కీలకం. పంటబోదెలు, చానళ్లవారీగా ఉన్న ఆయకట్టుకు ఎంత నీరివ్వాలి? ఏ సమయంలో ఎంత నీరు పెంచాలనేది అధికారుల సూచనలకు అనుగుణంగా వీరే చూస్తారు. డెరైక్ట్ పైప్(డీపీ)లు, చానల్స్ హెడ్ రెగ్యులేటర్లను ఎత్తడం, దించడం, లీకులు అరికట్టడం, లాకులవద్ద నీటిమట్టాలు పరిశీలించడం వంటి పనులు కూడా లష్కర్లే చేస్తారు. ప్రతి ప్రధాన లాకు వద్ద లాకు సూపరింటెండెంట్, నలుగురైదుగురు లష్కర్లు బాధ్యతలు నిర్వహించేవారు.

‘ఇప్పుడు కొన్ని ప్రధాన లాకుల వద్ద ఒక్క లష్కర్ కూడా లేడు. పక్క లాకు పరిధిలో ఉన్న ఒకరు లేదా ఇద్దరు లష్కర్లను ఇన్‌చార్జిగా వేస్తున్నారు. ఐదారుగురు చేసే పని ఒకరు చేయాల్సి వస్తోంది’ అని అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అర్జునుడు చెప్పారు. ఈ లోపాలవల్ల నీటి యాజమాన్య నిర్వహణ విఫలమవుతోంది. వచ్చే రబీలో ఆయకట్టు అవసరాలకు దృష్ట్యా సాగునీరు పంపిణీ చేయకుంటే రైతులు కొట్లాడుకునే ప్రమాదముంది.
 
ఔట్‌సోర్సింగ్ నియామకాలు జరిగేనా?
లాకులపై లష్కర్లు లేకుండా నీటి యాజమాన్యం చేయడం కష్టమని ఇటీవల కాకినాడలో జరిగిన ఐఏబీ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన గోదావరి డెల్టా సీఈ హరిబాబు.. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. వాస్తవానికి లష్కర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించాలన్న ప్రతిపాదన రెండేళ్లుగా ప్రభుత్వం వద్ద ఉంది. కోర్టు తీర్పును అనుసరించి అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌కు అంగీకరించింది. అప్పటినుంచీ ఆర్థిక శాఖ అనుమతి రాక, ఇది ఆచరణకు నోచుకోలేదు.

ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఔట్‌సోర్సింగ్ నియా మకాలు ఎలా సాధ్యమన్నది ప్రశ్న. రెండేళ్లుగా ఎన్నికలు జరగక నీటిసంఘాలు మనుగడలో లేవు. లష్కర్ వ్యవస్థ నిర్వీర్యమైనా, సంఘాలున్న సమయంలో రైతులకు నీటి ఇబ్బంది రాకుండా అధికారులతో కలిసి సమన్వయంతో పని చేసేవారు. ఎగువ ప్రాంతాల రైతులు అవసరం లేకుండా నీటి చౌర్యానికి పాల్పడితే సంఘాలు జోక్యం చేసుకుని దిగువ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడేవి. ఇప్పుడు వారు కూడా లేకపోవడంతో వచ్చే రబీలో నోరున్నవాడికే నీరు దక్కే అవకాశముంది.

Advertisement
Advertisement