అప్రెంటీస్ నియామకాలు జరిగేదెప్పుడో? | Sakshi
Sakshi News home page

అప్రెంటీస్ నియామకాలు జరిగేదెప్పుడో?

Published Mon, Nov 10 2014 3:05 AM

apprentice appointments?

  •  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు  బేఖాతరు చేస్తున్న రైల్వే
  •  రెండేళ్లైనా వెలువడని నోటిఫికేషన్
  •  పెంచిన సీట్లు భర్తీ చేయని వైనం
  •  వయోపరిమితి దాటిపోతోందని అభ్యర్థుల భయాందోళన  
  • గుంతకల్లు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రైల్వే శాఖ బేఖాతరు చేస్తోంది. రెండేళ్లుగా అప్రెంటీస్ నియామకాలు చేపట్టకపోవడంతో అర్హులైన అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతోందని భయాందోళన చెందుతున్నారు. 1961 అప్రెంటీస్ చట్టం ప్రకారం ఏటా రైల్వేలో నియామకాలు నిర్వహించాల్సి ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వేలోని తిరుపతిలో ఉన్న క్యారేజ్ రిపేర్ షాపు(సీఆర్‌సీ), రాయన్పాడులోని వ్యాగన్ వర్క్‌షాపు, లాలగూడలోని క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్‌షాపుల్లో అప్రెంటీస్ నియామకాలు నిర్వహించి ఆయా గ్రేడల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి శిక్షణ ఇస్తారు. ఈ నియామకాలను 2012 వరకు నిర్వహించారు. ఆ తర్వాత అప్రెంటీస్ నియామకాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో అప్రెంటీస్‌పై ఆశలు పెట్టుకున్న వారు ఆవేదన చెందుతున్నారు.
     
    ఇదిలావుండగా అప్రెంటీస్ సీట్లు పెంచుతూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ 2011లో జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. ఈ ఉత్తర్వుల ప్రకారం దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 1764 మంది అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్‌లో నియమించాల్సి ఉంది. గుంతకల్లు డివిజన్ పరిధిలోని తిరుపతి సీఆర్‌ఎస్‌లో 81, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపోలకు సంబంధించి గుంతకల్లులో 22, గుత్తిలో 18, తిరుపతిలో 99 మందిని నియమించాలి. అదేవిధంగా డీజిల్‌షెడ్లలో గుంతకల్లులో 146, గుత్తిలో 8 మందికి ఇలా మొత్తం డివిజన్ వ్యాప్తంగా 374 మందికి రైల్వేలో అప్రెంటీస్ శిక్షణ ఇవ్వాలని సిపార్సు చేసింది. దీనికి అనుగుణంగా రైల్వే బోర్డు కూడా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
     
    అయితే అప్రెంటీస్‌ల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు వచ్చి రెండేళ్లయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నియామకాలకు సంబంధించి గరిష్టి వయోపరిమితి 24 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే అప్రెంటీస్ నియామకాలకు నోటిఫికేషన్ రెండేళ్లుగా వెలువడకపోవడంపై ఐటీఐ చేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు ఎక్కడ వయోపరిమితి దాటిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి అప్రెంటీస్ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
     

Advertisement
Advertisement