పక్కా ప్లాన్‌తోనే అప్రూవల్ | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌తోనే అప్రూవల్

Published Sat, Feb 1 2014 3:12 AM

approval is with perfect plan

  నీటిపారుదల శాఖ భూమిపై వివాదం
  లోకాయుక్త, హైకోర్టుల్లో కేసులు
  అయినా భవన నిర్మాణానికి అనుమతినిచ్చిన
 ధవళేశ్వరం పంచాయతీ కార్యదర్శి
  అధికారులకు, అధికార పార్టీ నాయకులకు
 భారీ మొత్తంలో నజరానాలే కారణం!
 
 రాజమండ్రి రూరల్/ధవళేశ్వరం, న్యూస్‌లైన్ :
 ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ఆ భూమి.. నీటిపారుదల శాఖకు చెందిందా లేక ప్రైవేట్ వ్యక్తులదా అన్న దానికి సంబంధించిన వివాదాలు ప్రస్తుతం లోకాయుక్తలో, హైకోర్టులో ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన నిజమే.. అయినా నిబంధనలను నీరుగారుస్తూ.. ఆ భూమిలోని రెండు ప్లాట్లలో మూడు భవనాల గ్రౌండ్ ఫ్లోర్ల నిర్మాణానికి నిస్సంకోచంగా ప్లాన్ అప్రూవల్ ఇచ్చేశారు. అధికారులకు, అధికార పార్టీ నాయకులకు పెద్దమొత్తంలో ముడుపులను మంచినీళ్ల ప్రాయంలా వెదజల్లడమే ఇందుకు కారణమన్న ఆరోపణ ప్రబలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
 ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని  సర్వే నంబరు 326లో నీటిపారుదల శాఖకు చెందిన 5.90 ఎకరాల భూమి ఉంది. ఇందులో గట్టి గోపాలరావు అనే వ్యక్తికి 1962లో 2.90 ఎకరాలు, ఉల్లి వెంకట సుబ్బారావు అనే వ్యక్తికి 1968లో 3 ఎకరాలు లీజుకిచ్చారు.
 
  1989 వరకూ లీజు పొడిగించినట్టు నీటిపారుదల శాఖ అధికారుల వద్ద రికార్డులున్నాయి. అయితే నాటి నుంచి లీజు పొడిగించినట్టు ఎక్కడా నమోదు కాలేదు. వెంకట సుబ్బారావుకు గతంలో లీజుకు ఇచ్చిన భూమి అధికార పార్టీ నాయకుల అండదండలతో రియల్టర్ల పరమైంది. లీజు కాలం పూర్తయినా నీటిపారుదల శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోకపోవడంతో అంతకు ముందు వెంకట సుబ్బారావుకు లీజుకిచ్చిన మూడు ఎకరాలలోకి సింగంశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి కౌలుదారుడిగా ప్రవేశించాడు. అధికార పార్టీ నేతల సహకారంతో సత్యనారాయణ, వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు కలిసి ఆ భూమిని లే అవుట్‌గా చేసి ప్లాట్లు వేశారు. అంతేకాక కడియం సబ్ రిజిస్ట్రార్ ఒకే రోజు 44 రిజిస్ట్రేషన్లు చేయడం కూడా అప్పటిలో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నీటిపారుదల శాఖ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి, లే అవుట్ వేసిన విషయమై సమగ్ర విచారణ జరిపించాలని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి అని నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు గానీ, రిజిస్ట్రార్ గానీ కౌంటర్ దాఖలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
 ప్రజా ప్రయోజన వ్యాజ్యం బేఖాతరు
 లే అవుట్‌లో బినామీలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్లాట్ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించి 1908 నుంచి అది పట్టా భూమి అని, నీటిపారుదల శా స్థలం కాదని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు జరుపుకొనేందుకు వీలుగా స్టే తెచ్చుకున్నారు. అనంతరం అధికార పార్టీ నాయకుల అండదండలతో పాటు పంచాయతీ అధికారులపై ఒత్తిడి తేవడంతో పాటు భారీగా ముడుపులు అందించి.. ఆ వివాదాస్పద భూమిలో నిర్మాణాలకు అనుమతి కూడా పొందారు. ధవళేశ్వరం పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి కృష్ణ గ్రామ ప్రత్యేకాధికారి అయిన రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ సుభాషిణికి తెలియకుండానే 29, 30 నంబరు ప్లాట్లలో వల్లూరి తాతబ్బాయి చౌదరి, వల్లూరి సత్యనారాయణల పేరున మూడు భవనాల గ్రౌండ్ ఫ్లోర్‌ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేశారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం అని, వివాదం కోర్టులో ఉందని తెలిసినా కార్యదర్శి భవన నిర్మాణపు ప్లాన్‌కు అనుమతి ఇవ్వడం పథకం పక్కా పథకం ప్రకారం పెద్ద తలకాయలే జరిపించాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ స్థలంలో లే అవుట్ వేసి విక్రయించినా అది ప్రభుత్వానికి చెందినదేనంటూ ఒక స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
 
 పంచాయతీ కార్యదర్శిపై కేసు పెడతాం..
 కాగా తమ శాఖకు చెందిన స్థలంలో అక్రమంగా లే అవుట్ వేసిన వ్యవహారంపై కోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉందని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కాశీ విశ్వేశ్వరరావు చెప్పారు. అలాంటప్పుడు పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా ప్లాన్ అప్రూవల్ ఇస్తారని ప్రశ్నించారు. ఆయనపై కేసు వేయడంతో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.  
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement