ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం | Sakshi
Sakshi News home page

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

Published Tue, Jul 30 2019 3:35 AM

Approval of the Monetary exchange bill - Sakshi

సాక్షి, అమరావతి : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లును రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. 2019 ఏప్రిల్‌ ఒకటో తేదీతో ఆరంభమైన ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2.32 లక్షల కోట్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రతిపాదించిన ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లును బలపరుస్తూ మొదట ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన బడ్జెట్‌ అద్భుతంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ తమ బడ్జెట్‌ అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనిస్తున్నారని ప్రస్తుతించారు. అలాగే, అవినీతి రహిత పారదర్శక పాలనే ధ్యేయంగా జగన్‌ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ సమావేశంలో ఆమోదించిన విప్లవాత్మక బిల్లులు.. సంక్షేమ, ప్రగతికారక బడ్జెట్‌ను దేశం యావత్తూ ఆసక్తిగా చూస్తోందని కొనియాడారు.

నామినేషన్‌పై ఇచ్చే పనుల్లోనూ, నామినేటెడ్‌ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లు దేశంలోనే విప్లవాత్మకమైనదని వివరించారు. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కూడా చరిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు బాలరాజు, అప్పలరాజు, టీడీపీ సభ్యులు సాంబశివరావు, వాసుపల్లి గణేష్‌ తదితరులు ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టమైన వివరణ ఇచ్చిన అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని గౌరవ సభ్యులకు విజ్ఞప్తిచేయగా.. అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య సభ ఈ బిల్లును ఆమోదించింది.  

Advertisement
Advertisement