ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

Published Tue, Aug 13 2013 5:26 AM

Arrangements finished for by-election

సాక్షి, విజయవాడ : అవనిగడ్డ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఆఫీసర్ భన్వర్‌లాల్ తెలిపారు. ఈ నెల 21న జరిగే ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారని ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి, ఎస్పీ జె.ప్రభాకరరావులతో సోమవారం ఆయన సమావేశమై ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు.

 

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 1.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 93 వేల మంది పురుషులు, సుమారు 94 వేల మందికి పైగా స్త్రీలు ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. మొత్తం 241 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 2,500 మంది సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, పోలింగ్ కేంద్రాల అధికారులుగా ఇతర విధులకు నియమించామని వివరించారు.

 

33 పోలింగ్‌స్టేషన్లను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, వాటిలో ప్రత్యేకంగా కేంద్ర పారామిలటరీ బలగాలు, స్పెషల్ పోలీసుల్ని బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మినహా మిగిలినచోట్ల వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను నియమించామని చెప్పారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఎన్నికల అధికారులు ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తారని, ఆయా తేదీల్లో తీసుకోనివారికోసం 21న పోలింగ్ కేంద్రాల్లో బూత్ రిటర్నింగ్ అధికారులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లను అనుమతించబోమన్నారు.

 

 21, 22 తేదీల్లో ‘అవనిగడ్డ’లో సెలవు..

 ఉప ఎన్నికలను పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గంలో 21, 22 తేదీల్లో జిల్లా అధికారులు సెలవుగా ప్రకటించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. అక్కడి నుంచి బయట ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లేవారికి కూడా ఆ రోజుల్లో సెలవులు ఉంటాయని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సోమవారం నుంచే శిక్షణ తరగతులు మొదలు పెట్టామన్నారు. ఇప్పటికే ఏపీ ఎన్జీవోలతో మాట్లాడి ఎన్నికల్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశామని చెప్పారు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగులు ఎన్నికల విధులకు హాజరుకావాలని తెలిపారు.

Advertisement
Advertisement