రక్తంతో తడిసిన రహదారులు | Sakshi
Sakshi News home page

రక్తంతో తడిసిన రహదారులు

Published Sun, Sep 1 2013 4:19 AM

Arterial blood stained

రహదారులు రక్తం రుచిమరిగాయి. జిల్లాలో ప్రతి రోజూ రెండు, మూడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిద్దరు మృత్యువాతపడుతుండగా, వీరి సంఖ్య కొన్ని సందర్భాల్లో రెట్టింపుగా కూడా ఉంటోంది. మరెందరో కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మిగిలిపోతున్నారు. దీంతో ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. తాజాగా శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు భారతి సిమెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రమాదాల నివారణలో యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.
 
 ప్రొద్దుటూరు క్రైం/ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: ఎర్రగుంట్లలోని కడప రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్ సహా వల్లపు సురేంద్ర, కొమ్మెర వెంకటసుదర్శన్, కొమ్మెరప్రతాప్ ఉన్నారు. చిలంకూరుకు చెందిన సునీల్‌కుమమార్‌రెడ్డి భారతి సిమెంట్ కర్మాగారంలోని హాజీ ఏపీబావా కన్‌స్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తుండగా, కేరళకు చెందిన వినోద్ కూడా అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.
 
 వీరు ఎర్రగుంట్లలో నివాసం ఉంటూ ప్రతి రోజూ విధులకు వెళ్లొచ్చేవారు. ఈ క్రమంలోనే  శనివారం ఉదయం ప్లాటినా బైక్‌లో సిమెంట్ ఫ్యాక్టరీకి బయలు దేరారు. ఎర్రగుంట్లలోని మహేశ్వరనగర్‌లో నివాసముంటున్న బేల్దారీలు సురేంద్ర, వెంకటసుదర్శన్, కొమ్మెరప్రతాప్ టీవీఎస్ ఎక్స్‌ఎల్‌లో నల్లింగాయపల్లెకు బయలు దేరారు. కడప రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపానికి రాగానే  ఎదురుగా వచ్చిన ఫర్చూనర్ అనే కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొంది. ముందుగా టీవీఎస్ ఎక్స్‌ఎల్‌ను ఢీకొన్న  కారు తర్వాత వారి వెనకాలే వస్తున్న సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్ బైక్‌ను ఢీకొంది. ఘటనలో ఐదుగురూ గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని 108లో ప్రొద్దుటూరులోని జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్‌లను కర్నూలుకు, వెంకటసురేంద్ర, ప్రతాప్‌ను కడప రిమ్స్‌కు తరలించారు. చిలంకూరు సర్పంచ్ కె.పుల్లయ్య, ఆనందరెడ్డి జిల్లా ఆస్పత్రికి విచ్చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రగుంట్ల ఏఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తె లిపారు.
 
 సింహాద్రిపురంలో...
 సింహాద్రిపురం మండలం గురిజాల సమీపంలో శనివారం ఉదయం బొలెరో బోల్తా పడిన సంఘటనలో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పాతపల్లె మాజీ సర్పంచ్ సహా ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాతపల్లెకు చెరందిన మాజీ సర్పంచ్ నాగార్జునరెడ్డి తన కుమారుడు శశికుమార్‌రెడ్డి, కోడలు స్వాతితో పాటు వియ్యంకురాలు ప్రభావతి ఆస్ట్రేలియా నుంచి విమానంలో శుక్రవారం రాత్రి బెంగళూరుకు వచ్చారు.
 
 వారిని పిల్చుకొచ్చేందుకు నాగార్జునరెడ్డి బొలెరోలో బెంగళూరు వెళ్లి వారిని పిల్చుకొని స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని గురిజాల సమీపానికి రాగానే ఇక్కడి ఓ మలుపులో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో శశికుమార్‌రెడ్డి, స్వాతి, ప్రభావతి తీవ్రంగా గాయపడగా, నాగార్జునరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు.  వెంటనే క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
   
 అట్లూరులో...
 అదుపు తప్పిన ఓ కారు అట్లూరు మండలం మాడపూరు చెరువులోకి దూసుకెళ్లింది. మన్యంవారిపల్లె గ్రామంలోని భాస్కర్‌రెడ్డికి చెందిన టాటా ఇండికా కారు బద్వేలు వైపు నుంచి వేమలూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని మాడపూరు చెరువు కట్టపైకి రాగానే అదుపు తప్పి చెరువులోకి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతన్ని బద్వేలులోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
 
 కమలాపురంలో...
 సి.గోపులాపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కలమల్లకు చెందిన కుమార్ తీవ్రంగా గాయపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు దాటుతున్న అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108లో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉంది.  
 

Advertisement
Advertisement