ఆత్మలకు ఓట్లు! | Sakshi
Sakshi News home page

ఆత్మలకు ఓట్లు!

Published Sun, Dec 22 2013 11:45 PM

Articles about Voter List

 ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం వంటిది. అటువంటి ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు. ఓటర్ల జాబితాలు తప్పుల తడకలను తలపిస్తున్నాయి. జాబితాను సవరించాల్సిన అధికార గణం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించకపోవడం, ఒకే ఓటరు పేరు రెండుమూడుసార్లున్నా పట్టించుకోకపోవడం, బోగస్ ఓట్లను తీసివేయకపోవడం, ఫొటో ఒకరిది ఉంటే పేరు మరొకరిది, ఇంటి పేర్లలో తప్పులు.. ఇలా ఒకటనేమిటి.. ఎన్నో అవకతవకలు జాబితాలోు వెక్కిరిస్తున్నాయి.  జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓటరు జాబితాల్లో తప్పులు ఇంకా అలాగే కొనసాగుతున్నాయని ఆదివారం ‘న్యూస్‌లైన్’  పరిశీలనలో తేలింది.
 
 జాబితాల్లో మృతుల పేర్లు..
 ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని పోచారంలో దాదాపు 50మంది ఓటర్లు స్థానికంగా వుండటం లేదని తొలగించారు. అయితే ఇది ఏకపక్షంగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని ఓటరుజాబితాలోంచి పేరు తొలగించడం సమంజసం కాదని వారు అన్నారు. మండల పరిధిలోని ఆదిబట్ల గ్రామంలో సుమారు 2వేల మంది ఓటర్లు వున్నారు. మూడేళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు కూడా జాబితాలో వున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఎలిమినేడు గ్రామంలో దాదాపు 30మంది స్థానికంగా లేకున్నా ఓటర్లుగా పేరు కలిగివున్నట్లు తెలిసింది. వీరిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుటుంబం ఓట్లు కూడా వివాదాస్పదంగా మారాయి. నగరంలోని మలక్‌పేటతోపాటు స్వగ్రామంలో వీరు ఓట్లు కల్గివున్నారని ఇటీవల పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే.
 
 అవే తప్పులు మళ్లీ మళ్లీ..
 మొయినాబాద్: మండలంలోని అమ్డాపూర్‌లో కొత్త మంజూల (27)  రెండేళ్ల క్రితం మృతి చెందారు. కానీ ఆమె పేరు మాత్రం ఇంకా ఓటరు జాబితాలో అలాగే ఉంది. ఇదే మరో ఏడుగురు చనిపోయినవారి పేర్లు ఓటరు జాబితాలో తొలగించకుండా అలాగే ఉన్నాయి. గ్రామానికి చెందిన మద్యపాగ గౌరమ్మ(50) గతంలో అనేకసార్లు ఓటుహక్కును వినియోగించుకుంది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఓటరు జాబితాలో మాత్రం ఆమె పేరు రాలేదు. సురంగల్ గ్రామంలో సైతం ఆరుగురు మరణించినవారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. కొంత మంది పేర్లు ఓటరు జాబితాలో రెండుసార్లు వచ్చాయి. బూత్‌స్థాయి అధికారులు ఈతప్పులన్నీ సరిచేసి పంపినప్పటికీ మళ్లీ కొత్త జాబితా వచ్చినప్పుడు అవే తప్పులు ఉంటున్నాయి.  
 
 అంతులేని అశ్రద్ధ
 మేడ్చల్/ మేడ్చల్ రూరల్:మండలంలోని అత్వెల్లిలో రాజమల్లారెడ్డి అ నే వ్యక్తి  మూడేళ్ల క్రితం మరణించగా ఆయన పేరు ఇప్పటికీ ఓటరు జాబితాలోంచి తొలగిం చలేదు. ఏడాది క్రితం మరణించిన నీలమ్మ, మండల సత్తయ్య, ప్రతాప్‌రెడ్డి తదితరుల పేర్లు ఓటరు జాబితాలో కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలో 2,300 ఓటర్లలో 100 వరకు తప్పులున్నాయి. ఎల్లంపేట గ్రామంలో అర్హత లేని ఓట్లను తొలగింపు ప్రక్రి య కాగితాలకే పరిమితమయ్యింది. చని పోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించకుండా వారి ఫొటోల పక్కన చనిపోయారని రాసి ఉంచారు. కొత్తవారి నుంచి ఫారాలు తీసుకుంటున్నారే కానీ మిగతా వాటిపై శ్రద్ధ కనబరచడం లేదు.
 
 చనిపోయినా..
 యాలాల: యాలాల అనుబంధ గ్రామం గోవిందరావుపేటకు చెందిన నాదర్గి సాయన్న (62) ఏడాది క్రితం చనిపోయారు. కానీ నూతన ఓటరు జాబితాలో సాయన్న వివరాలు అలాగే ఉన్నాయి. ఇలాగే మండలంలోని చాలా గ్రామాల్లో మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి అధికారులు తొలగించలేదు.  
 
 ఫొటో ఒకరిది.. వివరాలు మరొకరివి..
 దోమ: మండల పరిధిలోని పాలేపల్లికి చెందిన తుప్పల కిష్టమ్మ, ఎం.బిచ్చమ్మ, ఎస్. అంజిలయ్య, శివన్నగారి నర్సమ్మ, బొక్క నర్సమ్మలు మృతి చెంది నెలలు గడుస్తున్నా ఓటరు లిస్టులో వారి పేర్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఇక 20మందికి పైగా ఓటర్ల పేర్లు రెండేసి సార్లు వచ్చాయి. చాలా మంది విషయంలో ఫొటోలు ఒకరివైతే వివరాలు వేరొకరివి ఉండడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.  
 
 ఒకే పేరు.. రెండేసి ఓట్లు
 ఘట్‌కేసర్ టౌన్: ఘట్‌కేసర్ 11వ వార్డులో 547 క్రమసంఖ్యతో టి.రాజయ్య అనే వ్యక్తి మృతి చెంది రెండేళ్లు కావస్తున్నా ఆయన పేరునుజాబితా నుంచి తొలగించలేదు. 9వ వార్డులో 6-157 ఇంటి నంబర్‌పై 942 క్రమసంఖ్యతో కుమోజి శ్రీహరి పేరుతో, అదే వ్యక్తి 6-157/బి ఇంటి నంబర్‌లో 945 క్రమసంఖ్యతో శ్రీహరి కుంబోజి పేరుతో ఓటు కలిగి ఉన్నాడు.ఇలా ఒక గ్రామంలోనే వందలాదిగా రెండేసిసార్లు ఓట్లున్నాయి.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement