అశోక్‌ తంత్రం! | Sakshi
Sakshi News home page

అశోక్‌ తంత్రం!

Published Sat, Mar 30 2019 1:51 PM

Ashok Babu Team  in Election Campaign - Sakshi

పచ్చచొక్కాలేసుకున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు.  కొందరు అధికారులైతే కొన్ని కీలక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అయితే వీరిమాయమాటలను నమ్మబోమంటూ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు.

సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరుడిగా ముద్రపడిన ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర నేత పరుచూరి అశోక్‌బాబు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత రెండ్రోజులుగా విశాఖ లోనే మకాం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తన ముసుగు తీసేసి టీడీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న అశోక్‌బాబు రాష్ట్రమంత్రి లోకేష్‌ తోడల్లుడు భరత్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడులకు అనుకూలంగా ఆయా నియోజకవర్గాల్లో పరోక్షంగా ప్రచారం చేస్తు న్నారు. అశోక్‌బాబు గడిచిన రెండ్రోజులుగా విశాఖలోనే మకాం వేసి ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. అశోక్‌బాబుకు అనుకూలమైన ఉద్యోగ సంఘ జిల్లా నేత వివిధ సంఘాల నేతలను రప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఓ çహోటల్‌లో దిగిన అశోక్‌బాబు ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అయ్యేందుకు యత్నిస్తున్నప్పటికీ మెజార్టీ ఉద్యోగ సంఘల నేతలు రావడానికి ససేమిరా అంటున్నారు. ఇటీవలే ఏసీబీ కేసులో అడ్డంగా దొరికిపోయిన జిల్లా ఎన్‌జీవో సంఘ నాయకుడొకరు అశోక్‌బాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు.

ఈయనపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తులు కేసును ఎత్తి వేయిస్తానని ప్రభుత్వ పెద్దల తరఫున అశోక్‌బాబు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే సదరు ఉద్యోగసంఘ నేత తనకు అనుకూలంగా ఉన్న సంఘాల సభ్యులను అశోక్‌బాబు వద్దకు తీసుకొచ్చి ఉద్యోగులంతా టీడీపీకి అనుకూలంగానే ఉన్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అశోక్‌బాబును కలిసేందుకు ఉద్యోగ సంఘ నేతలు కానీ, ఉద్యోగులు కానీ ఏమాత్రం ఇష్టపడడం లేదు. అంతేకాదు భూకుంభకోణంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు వంటి కేసులు నమోదైన అధికారులకు కూడా ఇదే తరహా హామీ అశోక్‌బాబు ఇచ్చి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరో వైపు రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ జాతీయ నేతంటూ మరో నేత శుక్రవారం నగరంలో మకాం వేశారు. నాలుగేళ్లు తప్పించుకుని ఇటీవలే 75 ఏళ్ల వయస్సు కలిగిన వారికి పెన్షన్‌ 10 శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిటైర్డ్‌ ఉద్యోగుల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 70 ఏళ్లు దాటిన వారికి 15 శాతం, 80 ఏళ్లు దాటిన వారికి 25 శాతం పెంచాలని 90 ఏళ్లు దాటిన వారికి 50 శాతం పెరగాలని, 100 ఏళ్లు దాటితే 100 శాతం పెంచాలని గత పీఆర్సీ కమిషన్‌ సిఫార్సు చేసింది. వాటిని అమలు చేయని ప్రభుత్వం నాలుగేళ్లు తిప్పించుకుని 70 ఏళ్లు ఉన్న వారికి మాత్రమే పెన్షన్‌ 10 శాతం పెంచడాన్ని మెజార్టీ రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడతున్నారు. ఈ పరిస్థితిలో వచ్చిన ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తున్న టీడీపీ నాయకులు అశోక్‌బాబును ఎరగా వేసి ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా అది సఫలీకృతం కావడం లేదు.

Advertisement
Advertisement