కలిసుండాలో, వద్దో సభలే తేల్చాలి | Sakshi
Sakshi News home page

కలిసుండాలో, వద్దో సభలే తేల్చాలి

Published Fri, Dec 20 2013 1:19 AM

kiran kumar reddy - Sakshi

  • విభజనను అడ్డుకుంటానన్న వ్యాఖ్యకు కట్టుబడ్డా: సీఎం కిరణ్ స్పష్టీకరణ
  • సమైక్యానికి టీ నేతలను ఒప్పించే బాధ్యత సీమాంధ్రులదే
  • సవరణ పేరుతో విభజన బిల్లుపై ఓటింగ్ కోరవచ్చు
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కలసి ఉండాలా, వద్దా అనే విషయాన్ని శాసనసభ, శాసనమండలి మాత్రమే తేల్చాల ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విభజన వద్దంటూ తెలంగాణ నేతలను ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న సీమాంధ్రులపైనే ఉందన్నారు. విభజన తుపానును అడ్డుకుంటానంటూ గతం లో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని చెప్పారు. ఈ విషయంలో విపక్ష నేతల సర్టిఫికెట్లు తనకు అక్కర్లేదన్నారు. అసెంబ్లీ జనవరి 3కు వాయిదా పడ్డాక గురువారం కిరణ్ అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...


     చర్చపై డిప్యూటీ స్పీకరే చెప్పాలి
     ‘‘విభజన బిల్లు పత్రాలను ప్రస్తుతం సభలో టేబుల్ చేశారు. ప్రొసీజర్స్ సిద్ధం చేశాక చర్చ మొదలవుతుంది. అసలు ప్రొసీజర్సే సిద్ధం కాన ప్పుడు చర్చ ప్రారంభమైందని ఎలా అంటారు? ఆ రోజు సభను నడిపించిన డిప్యూటీ స్పీకర్, శాసనసభా వ్యవహారాల మంత్రే దీనికి సమాధానం చెప్పాలి.


     ఓటింగ్ ఉండదని ఎవరు చెప్పారు?
     బిల్లుపై ఓటింగుండదని ఎవరు చెప్పారు? అసలు అభిప్రాయాలంటే ఏమిటనుకుంటున్నారు? 10 మంది ఒక అభిప్రాయం చెబితే 284 మంది మరో అభిప్రాయం చెప్పారనుకోండి. వాటిని ఏ రూపంలో చెబుతారు? ఓటింగ్  రూపంలోనే కదా! విభజన బిల్లు సహా మరే ఇతర బిల్లుపై అయినా సవరణల పేర ఓటింగ్ కోరవచ్చు. విభజన బిల్లు అందు కు అతీతం కాదు. ఈ విషయంలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు మన ముందున్నాయి. 3 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలే రాష్ట్రపతి బిల్లును ప్రవేశపెట్టి, సవరణలు ప్రతిపాదించి ఓటింగ్ కూడా నిర్వహించాయి. బీహార్‌లోనైతే 1998లో రాష్ట్రపతి బిల్లును తిరస్కరించారు.


     బిల్లుపై కేంద్రానికి లేఖ రాస్తున్నా
    రాష్ర్టపతి పంపిన విభజన బిల్లు సమగ్రంగా లేదు. చాలా అంశాల్లో స్పష్టత కొరవడింది. ప్రతిపక్షాలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరింత సమాచారం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరముంది. అందుకే సాధ్యమైన తొందర్లో స్పష్టత ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తాం. అయినా దీనిపై జనవరి 3 దాకా సమయమున్నందున తొందర పడాల్సిన అవసరం లేదు. విభజన బిల్లును అడ్డుకునేందుకే నేనిలా వ్యవహరిస్తున్నాననడం సరికాదు. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పెంచాలని కోరే ఆలోచన కూడా బాగుంది.

    ఒప్పించే బాధ్యత సీమాంధ్ర నేతలదే
    తెలంగాణ వాళ్లు ప్రత్యేక రాష్ర్టం కావాలంటున్నారు. సమైక్యం కోరుకుంటున్న సీమాంధ్ర నేతలు వాళ్లను నొప్పించకుండా మాట్లాడాలి. ఫలానా కారణాల వల్ల రాష్ట్రం సమైక్యంగా కొనసాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతూ తెలంగాణ వారిని ఒప్పించాలే తప్ప వారి మనసులను గాయపర్చేలా వ్యవహరించొద్దు.


     నేను మారను: తుపానును ఆపలేకపోయినా విభజనను ఆపుతాననే మాటకు ఈ రోజుకూ కట్టబడి ఉన్నాను. ఈ విషయంలో చివరి వరకు పోరాటాన్ని ఆపను. నేను ఫైటర్‌ను. నా ఆరోగ్యం బాగోలేక, లేవలేని పరిస్థితుల్లో ఉన్నందున ఆ రోజు సభకు రాలేకపోయాను. ఈ విషయంలో నా సిన్సియారిటీని విభజనపై అనుకూల లేఖలిచ్చిన వాళ్లు ప్రశ్నించనక్కర్లేదు. విభజన ఆగుతుందా, లేదా అనేది మరికొద్ది నెలల్లో మీరే చూస్తారు కదా! విభజన వల్ల నష్టం జరుగుతుందనే విషయంలో ఇప్పటికి నేను 25 శాతం మాత్రమే చెప్పాను. మిగతాదంతా రేపు అసెంబ్లీలో చెబుతా. అసలు ఈ రాష్ట్రం కలిసుండాలా, వద్దా అనేది మండలి, అసెంబ్లీలే తేల్చాలి.


     మిగులు జలాలపై వైఎస్ లేఖ రాయలేదు
     మిగులు జలాలపై హక్కు కోరబోమంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి లేఖ రాశారంటూ తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే వాటికి సంబంధించి వైఎస్ అసలు లేఖ రాయనే లేదు. సంబంధిత శాఖాధికారులు మాత్రమే ఆనాడు లేఖ రాశారు. అంతెందుకు.. 1997లో కూడా అప్పటి ప్రభుత్వం అదే విధంగా లేఖ రాసింది. అందులో కొన్ని పదాలు వేరైనా సారాంశం మాత్రం ఒక్కటే. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పువల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరగబోతున్నందున కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరేందుకే శుక్రవారం ప్రధానిని కలవబోతున్నాం. మిగులు జలాలను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలనడంపై మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం’’.

Advertisement

తప్పక చదవండి

Advertisement