ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటికే.. | Sakshi
Sakshi News home page

ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటికే..

Published Sat, Jun 14 2014 2:15 AM

Assistants working in the field of the national rural employment guarantee scheme

కర్నూలు(అగ్రికల్చర్): ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి రాగానే తన అసలు రూపం బయటపెట్టారు. ఉద్యోగం మాట దేవుడెరుగు.. ఉన్న చిరుద్యోగం కూడా ఊడబెరికేందుకు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదర్శ రైతులు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధమవుతుండటం ఎన్నో జీవితాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదర్శ రైతు వ్యవస్థను టీడీపీ నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను సమీక్షిస్తూ రద్దు దిశగా చర్యలు చేపడుతోంది.
 
అందులో భాగంగానే ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ల మెడపై మొదటగా కత్తి పెడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 1,658 మంది ఆదర్శ రైతులు పని చేస్తుండగా.. ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 గౌరవ వేతనం చెల్లిస్తోంది. అదేవిధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఉపాధి పనుల నిర్వహణలో వీరే కీలకం. ఆదర్శ రైతలు, ఫీల్డ్ అసిస్టెంట్లలో అధిక శాతం కాంగ్రెస్ కార్యకర్తలే పని చేస్తున్నారనేది టీడీపీ నేతల భావన. ఆ మేరకు ఈ పోస్టులను రద్దు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్న చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనగా ఆందోళన బాట పట్టేందుకు వీరు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలాఉండగా అన్ని శాఖల్లో కలిపి జిల్లాలో దాదాపు 30వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం ఈనెల చివరితో ముగియనుంది. ప్రభుత్వం వీరి కాంట్రాక్టు పొడిగిస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు శాఖల్లో వీరిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement