63 కేజీల పసిడి పట్టివేత | Sakshi
Sakshi News home page

63 కేజీల పసిడి పట్టివేత

Published Tue, Jun 23 2015 3:20 AM

63 కేజీల పసిడి పట్టివేత - Sakshi

* విశాఖ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ గుట్టు రట్టు
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం: భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలను విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయం చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఏకంగా 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రాత్రి ప్రారంభమైన తనిఖీలు సోమవారం రాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరింత బంగారం పట్టుబడే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.రాజేంద్రన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన కొందరు ముఠాలుగా ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాల లోపలి భాగాల్లో ఉంచడం ద్వారా సింగపూర్, మలేసియా దేశాల నుంచి హైదరాబాద్, విశాఖలకు భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్‌ఐ చెన్నై జోనల్ యూనిట్‌కు సమాచారం అందింది.

వెంటనే అధికారులు హైదరాబాద్, విశాఖలకు ప్రత్యేక బృందాలతో చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9.10 సమయంలో కౌలాలంపూర్ నుంచి విశాఖ వచ్చిన ఎయిర్ ఏషియా 83, మిలిందో 251(రాత్రి 10.05గంటలు) విమానాలతో పాటు సింగపూర్ నుంచి వచ్చిన సిల్క్ ఎయిర్ ఎంఐ442 (రాత్రి 11గంటలు) విమానంలో స్మగ్లింగ్ బంగారం ఉన్నట్లు గుర్తించారు. మూడు విమానాల్లోని ప్రయాణికులను, వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చే శారు.

56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మ్యూజిక్ సిస్టమ్‌లు, యాంప్లిఫయర్లు, మినీ వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రిక్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్, టీవీ, ఇతర పరికరాల్లో బంగారం దాచి తీసుకువస్తున్నట్లు తేల్చారు. మొత్తం రూ.16.85 కోట్ల విలువైన 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శర్మ కస్టమ్స్ అధికారులకు సహకరించారు.

తనిఖీలు పూర్తి చేసుకున్న ప్రయాణికుల్లో తమిళనాడుకు చెందిన పలువురు ఉన్నారు. మరోవైపు నిందితుల తరఫున కొందరు తమిళనాడు నుంచి విశాఖ చేరుకున్నారు. దీంతో విమానాశ్రయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

Advertisement
Advertisement