Sakshi News home page

ఏటీఎం@ మోసం

Published Wed, Jun 19 2019 9:57 AM

ATMs Are Becoming Fraud Without Security - Sakshi

సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : ఏటీఎంలు మోసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. జేబులో చెయ్యి పెట్టి లాఘవంగా చోరీ చేసే అవస్థ లేకుండా ఏకంగా బ్యాంకులో ఉన్న డబ్బుకే కన్నం వేసేలా కొత్త తరహా మోసాలకు వేదిక అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. ఇలాంటి ఏటీఎంలను చూసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. ఎవరైనా సాయం అడిగితే ఏ మాత్రం సంకోచించకుండా కార్డు మార్చి డబ్బు కొట్టేస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం తెలీని వారిని టార్గెట్‌ చేసి మోసం చేస్తున్నారు. కేవలం రాజాం సర్కిల్‌లోనే ఈ ఆరు నెలల వ్యవధిలో ఆరు కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి ఇంకెన్నో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ప్రతి గురువారం సంత జరగడం, రైతులు ఎక్కువ మంది రావడంతో వారే ఎక్కువగా మోసపోతున్నారు. 

సెక్యూరిటీ ఏది?
డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులతోపాటు రైతులు అధిక మొత్తంలో బ్యాంకు ఖాతాలను తెరిచారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వేసిన పంట రుణాలు, రుణ మాఫీ వం టి వాటిని ఏటీఎంల ద్వారానే లావాదేవీలు జరుపుకుంటున్నారు. అయితే కొంతమందికి ఏటీఎం వినియోగించడం రాకపోవడంతో పక్కనున్నవారిని సాయం అడుగుతున్నారు. అదే వారికి శాపమవుతోంది. బ్యాంకుల్లో విత్‌డ్రాలు అందరికీ సరిపడినంత మొత్తం ఇచ్చి ఉంటే రైతులతో పాటు సామాన్యులు కూడా మోసాలకు గురయ్యే పరిస్థితి ఉండదని పలువురు వాపోతున్నారు. సుమారు ఎనిమిది మండలాలకు కేంద్రబిందువుగా ఉన్న రాజాంలోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి.

దినదినాభివృద్ధి చెందుతున్న రాజాం పట్టణంలో ఏటీఎంలను వినియోగించే సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండి ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శివారు మండలమైన ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, నరసన్న పేట ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ లేని ఏటీఎంలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అలాగే ఏటీఎం మిషన్లు కూడా కొన్ని చోట్ల నగదు తీసే సమయంలో పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమయంలో ఫిర్యాదు చేసేందుకు సెక్యూరిటీ కూడా ఉండకపోవడంతో బ్యాంకుల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తుందని ఖాతాదారులు వాపోతున్నారు. 

సెక్యూరిటీ తప్పనిసరి 
దూర ప్రయాణాలు చేసే వారికి ఏటీఎంలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇదే అదనుగా చేసుకొని ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం రానివారు అక్కడ ఉన్నవారికి ఏటీఎం కార్డు ఇచ్చి మోసపోతున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డును ఏర్పాటుచేయాలి.
– బూరాడ అప్పలనాయుడు, అడ్వకేట్, రాజాం 

దర్యాప్తు చేస్తున్నాం 
ఏటీఎంలో నగదు పోయిన విషయమై గతంలో కొన్ని కేసులు రాజాం స్టేషన్‌లో నమోదయ్యాయి. వీటిపై దర్యాప్తు జరుపుతున్నాం. ఇప్పటికే రెండు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి వారిపై కేసులు నమో దు చేశాం. మిగిలిన కేసులపై కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశాం.
– జీవీ రమణ, సీఐ, రాజాం టౌన్‌

Advertisement

What’s your opinion

Advertisement