వైఎస్సార్‌ సీపీ నేత రెస్టారెంట్‌పై దాడి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేత రెస్టారెంట్‌పై దాడి

Published Thu, Jun 1 2017 1:14 AM

Attack on YSRCP  leader restaurant

అమలాపురం టౌన్‌ : స్థానిక రామకృష్ణానగర్‌లోని వైఎస్సార్‌ సీపీ నాయకుడు నూకల షణ్ముఖరావుకు చెందిన శ్రీనివాసా రెస్టారెంట్‌పై పట్టణానికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు అనుచరులతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టి దహనం చేసేందుకు విఫలయత్నం చేశారు. షణ్ముఖరావుపై దాడి చేశారు. ఆయన కుమారుడు నూకల ఫణి వీర శ్రీనివాస్‌పై మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 11.30 నుంచి 2.30 గంటల మధ్యలో వారు రెస్టారెంట్‌ వద్ద భయానక వాతావరణాన్ని సృష్టించారు. పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన రౌడీషీటర్‌ రవి రాజా పినిశెట్టి, మరో రౌడీ షీటరు సాధనాల హరీష్‌ (గొడ్డేష్‌), వారి అనుచరులు గుబ్బుల వంశీ, కోళ్ల అజయ్, మైనర్‌ బాలుడు (జువైనల్‌) ఈ దాడికి, దౌర్జన్యం, విధ్వంసాలకు పాల్పడి నట్టు చెబుతున్నారు.

పోలీసుస్టేషన్‌లో ఉండగానే బెదిరింపు ఫోన్‌..
ప్రాణభయంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న శ్రీనివాస్‌ ఫోన్‌కు రౌడీ షీటర్‌ రవిరాజా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫోన్‌ చేసి ‘నాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తాం.. నీ రెస్టారెంట్‌.. నీ ఇల్లు తగలబెట్టేస్తాం’ అంటూ బెదిరించాడు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అక్కసుతో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో రవిరాజా రౌడీ బృందం రెస్టారెంట్‌పై మరోసారి దాడికి పాల్పడి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించింది. తొలుత రెస్టారెంట్‌ చుట్టూ డీజిల్‌ ఆయిల్‌ పోశారు.

 తర్వాత కిరోసిన్‌ నింపిన బాటిల్స్‌ను వెలిగించి రెస్టారెంట్‌పైకి విసిరారు. దీంతో రెస్టారెంట్‌ వెనుక జనరేటర్, ఫర్నిచర్‌ పాక్షికంగా కాలిపోయాయి. ఈలోగా షణ్ముఖరావు, శ్రీనివాస్, స్థానికులు మంటలను అదుపు చేస్తుంటే, అగ్నిమాపక శకటం కూడా వచ్చి మంటలను అదుపు చేసింది. ప్రధాన నిందితుడైన రవిరాజా మినహా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. రౌడీషీటర్‌ రవిరాజా కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలో అతని ఇంటి వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశామన్నారు. వారిపై హత్యాయత్నం, దహనం, అక్రమ ప్రవేశం, బెదిరింపు తదితర నేరాలపై ఐదు సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు.

ఇంత రౌడీయిజమా?
అమలాపురం రూరల్‌ : సంఘటనా స్థలాన్ని వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం పరిశీలించారు. పట్టణంలో రౌడీషీటర్లు పెట్రేగిపోతున్న వైనంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరీ ఇంత రౌడీయిజమా?  అకారణంగా దాడులకు పాల్పడతారా? అంటూ అసహనం వ్యక్తంచేశారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌తో ఈ దాడి, హత్యాయత్నంపై చర్చించారు. బాధ్యులైన రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసం ఉంటున్న అమలాపురంలోనే రౌడీలు ఇలా చెలరేగిపోతున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదటి మోహన్,పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పుట్రేవు చందు, పట్టణ పార్టీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి సుంకర సుధ, పట్టణ యూత్‌ అధ్యక్షుడు నల్లా శివాజీ, రైతు విభాగం అధ్యక్షుడు బెజవాడ సత్తిబాబు, రూరల్‌ మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సరెళ్ల రామకృష్ణ తదితరులు షణ్మఖరావును పరామర్శించి సంఘీభావం తెలిపారు.

Advertisement
Advertisement