మహిళలపై దుండగుడి దాడి | Sakshi
Sakshi News home page

మహిళలపై దుండగుడి దాడి

Published Mon, Sep 14 2015 1:12 AM

మహిళలపై దుండగుడి దాడి

కర్రతో కొట్టడంతో ఇద్దరికి గాయాలు
కేకలు వేయడంతో పలాయనం
పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
పోలీసులకు అప్పగింత
మతిస్థిమితం లేదని సమాచారం
గతంలో జరిగిన బైక్ దొంగతనాలతో సంబంధాలున్నట్లు అనుమానం

 
ముదినేపల్లి రూరల్ : ఉభయ గోదావరి జిల్లాల్లో సూది సైకోగాళ్లు సంచలనం సృష్టిస్తుండగా తాజాగా ముదినేపల్లి మండలంలో ఆదివారంఒక వ్యక్తి ఇద్దరు మహిళలపై దాడిచేయడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదగొన్నూరు శివారు ఉప్పరగూడెంకు చెందిన మహిళలు స్థానిక పెదలంక డ్రెయిన్‌లో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, కలిదిండి ధనలక్ష్మి పెదలంక డ్రెయిన్‌పై ఉన్న వంతెన సమీపంలో ఆదివారం బట్టలు ఉతుకుతున్నారు. అదే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి కర్ర, కత్తి, తాడుతో హఠాత్తుగా దాడి చేశాడు. కర్రతో తలలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానిక యువకులు పరుగున వచ్చారు. వారిని గమనించిన సదరు వ్యక్తి సమీప పొలాల్లోకి పారిపోయాడు. యువకులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చినవాడవల్లి సమీపంలోని వరి పొలాల్లో దాక్కుని ఉన్న దుండగుడిని ఎట్టకేలకు పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో ముదినేపల్లి పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత మహిళలను స్థానికులు 108 అంబులెన్సులో గుడివాడలో ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

 మతి స్థిమితం లేకే...
 దుండగుడిని గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన ఈడే ఏడుకొండలుగా గుర్తించినట్లు తెలిసింది. పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం అత్తవారిల్లు కాగా కొంతకాలంగా మతి స్థిమితం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏడుకొండలు గురించి స్థానిక పోలీసు లు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని మోటార్ బైక్ దొంగతనం కేసుల్లో ఏడు కొండలు పాత్ర ఉన్నట్లు అనుమానించి విచారిస్తున్నట్లు సమాచారం.
 
 

Advertisement
Advertisement