‘బేబీ ఫ్యాక్టరీల’పై దాడులు | Sakshi
Sakshi News home page

‘బేబీ ఫ్యాక్టరీల’పై దాడులు

Published Sun, Jan 10 2016 3:56 AM

‘బేబీ ఫ్యాక్టరీల’పై దాడులు - Sakshi

హైకోర్టు ఆదేశాలతో ఐవీఎఫ్ కేంద్రాల్లో తనిఖీలు
 
 సాక్షి, విశాఖపట్నం: సంచలనం సృష్టించిన ‘సాక్షి’ కథనం బేబీ ఫ్యాక్టరీలపై హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. విశాఖపట్నంలో పలు ఐవీఎఫ్ కేంద్రాలపై శనివారం దాడులు నిర్వహించింది. ఫ్రీజింగ్ బ్యాంకుల్లో పిండాలతో సరోగసీ ద్వారా పిల్లలను పుట్టించి, విక్రయాలకు పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’ ఇటీవల ‘విశాఖలో బేబీ ఫ్యాక్టరీ’ శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయవాది అరుణ్‌కుమార్ రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలన్న కోర్టు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ యువరాజ్ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.

విశాఖ, అనకాపల్లి ఆర్డీవోలు, ఆర్ అండ్ ఆర్ (ఏపీఐఐసీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ల నేతృత్వంలోని ఈ బృందాలు నగరంలోని 11 సంతాన సాఫల్య కేంద్రాల్లో శనివారం తనిఖీలు చేశాయి. ఆయా కేంద్రాల్లో ఏడాదిగా ఎంతమంది సంప్రదించారు? ఎంతమందికి సరోగసీ, అండదానం చేశారు? చికిత్సకు ఎందరు వచ్చారు? వంటి అంశాలను ఆరా తీసినట్టు తెలిసింది. ఈ కేంద్రాల ద్వారా బిడ్డలను పొందిన వారితోనూ ఫోన్లో మాట్లాడి వివరాలు రాబట్టినట్లు సమాచారం. అలాగే వీరు ఎవరి ద్వారా ఆయా సెంటర్లకు వచ్చారు? దళారులు ఉన్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు విచారణ వివరాలను రహస్యంగా ఉంచారు.

 రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం
 విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పలు సంతాన సాఫల్య కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని ఐవీఎఫ్ కేంద్రాల్లో గత ఐదేళ్లుగా సరైన రికార్డులు నిర్వహించడంలేదని సమాచారం. ఇటువంటి అవకతవకలను తనిఖీ అధికారులు నమోదు చేసుకొని, కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. తుది నివేదికను ఆయన ఈ నెల 11 నాటికి హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

 అనుమతిలేకుండా సరోగసీ!
 నగరంలో నడుస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలకు సరోగసి అనుమతుల్లేవని అధికారులే చెబుతున్నారు. తాము సరోగసీ చేయడం లేదని ఈ కేంద్రాల నిర్వాహకులు తనిఖీల సమయంలో బుకాయించారు. అయితే కొన్ని కేంద్రాల ఆవరణలో తమ వద్ద ‘సరోగసీ, ఎగ్ డొనేషన్ సదుపాయం’ ఉందంటూ పెద్దపెద్ద బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.

 పోలీసుల తనిఖీలు
 పోలీసులు కూడా పలు సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మహారాణిపేట పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ గంగాధర్ శనివారం సాగరతీరంలో శిశు విక్రయాలకు నిలయంగా ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఐవీఎఫ్ కేంద్రాలకు వెళ్లి అక్కడున్న గర్భిణుల నుంచి వివరాలు సేకరించారు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా మూడు నెలల పాటు కదలకుండా కేంద్రాల్లోనే ఉండాలని వైద్యులు చెప్పడంతో ఇక్కడే ఉంటున్నామని అక్కడి రోగులు పోలీసులకు తెలిపారు.
 
 ‘బేబీ ఫ్యాక్టరీ’పై ఎఫ్‌ఐఆర్
 ‘బేబీ ఫ్యాక్టరీ’ల నిర్వాహకులపై తొలి కేసు నమోదైంది. సరోగసీ ద్వారా పిల్లలను విక్రయిస్తున్న ముఠాలపై ‘సాక్షి’ కథనాలకు విశాఖ జిల్లా శిశు సంక్షేమ అధికారి ఎ.సత్యనారాయణ స్పందించారు. బీచ్ రోడ్డు సమీపంలోని భాగ్యసాయి అపార్ట్‌మెంటులో పిల్ల ల విక్రయాలు సాగుతున్నట్టు ‘సాక్షి’ కథనాల వల్ల తెలుస్తోందని, దాని ఆధారంగా బేబీ ఫ్యాక్టరీ నిర్వాహకులు విజయలక్ష్మి, మూర్తిలపై కేసు నమోదు చేసి తగు చర్యలు చేపట్టాలని విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం సీఐ ఆర్ గోవిందరావు కేసు నమోదు చేశారు. ఇంత వరకూ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని, ఫిర్యాదు వచ్చినందున ఇప్పటికే పరారైన నిందితులను పట్టుకోవడానికి చర్యలు చేపడతామని సీఐ వెల్లడించారు.

Advertisement
Advertisement