కన్నోళ్లపై కాఠిన్యం | Sakshi
Sakshi News home page

కన్నోళ్లపై కాఠిన్యం

Published Thu, Jun 6 2019 12:56 PM

Attck on Parents For Assets Special Story - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): పిల్లలను కనడమే కాదు.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ విద్యాబుద్ధులు చెప్పించి, గొప్పవారిగా చూడాలని తల్లిదండ్రులు కలలుగంటారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తారు. అయితే ఆధునిక కాలంలో అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లో ఉన్నా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా మాట్లాడటం, తిట్టడం, తిండి పెట్టకపోవడం, అవమానించడం, కొట్టడం చేస్తున్నారు. మరికొందరు ఆస్తి కోసం కన్నవారని చూడకుండా కర్కశంగా చంపేస్తున్నారు. తిరుపతిలో మంగళవారం జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఆస్తి కోసం  ఓ వృద్ధున్ని కొడుకు, కోడలు దారుణంగా కారం చల్లి మరీ కొట్టడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  ఇలాంటి ఘటనలు జిల్లాలో పలుచోట్ల జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లు అనాథ వృద్ధులకు ఆశ్రయంగా మిగులుతున్నాయి. వీరికి ఎవరూ ఉండరా అంటే అందరూ ఉంటున్నారు. కానీ వారి ఆలనా పాలనా చూసే వారు మాత్రం కరువవుతున్నారు. ఫలితంగా చేతనైనంత కాలం బతుకీడ్చి తర్వాత తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో అధికమవుతున్నాయి. కర్నూలులోనే ప్రతి వారంలో ఒకరిద్దరు అనాథ వృద్ధుల మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. కనీసం వీరి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు సైతం ఎవరూ రావడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

చట్టం ఏం చెబుతోంది?
సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌(తల్లిదండ్రుల భృతి, సంరక్షణ)ను 2007లో ప్రవేశపెట్టారు. 2011లో దీనికి కొన్ని సవరణలు చేశారు. ఈ చట్టం ప్రకారం వృద్ధులకు భృతి, పోషణ, రక్షణ వంటి పరిహారాలు సులువుగా కల్పించనున్నారు. కుమారులకే కాకుండా కుమార్తెలకు కూడా ఇది వర్తించేలా వీలు కల్పించారు. వృద్ధాప్యంలో దుస్తులు, ఆహారం, వసతి వంటి కనీస సౌకర్యాలను కొడు కు, కుమార్తె, మనుమలు, మనవరా లి నుంచి కూడా పొందేందుకు ఈ చట్టం అవకాశం ఇచ్చింది. ఇలా దరఖాస్తు చేసుకోదలచిన వ్యక్తి 60 ఏళ్లకు పైబడి ఉండాలి. దత్తత పొందిన పిల్లల విషయంలోనూ ఈ చట్టం వర్తిస్తుంది. 

విచారణ చేసేదెవరు?
సబ్‌ డివిజనల్‌ అధికారి హోదాకు తక్కువ కాని అధికారి సారథ్యం వహించే ట్రిబ్యునల్‌ ఈ చట్టం పరిధిలోని కేసులను విచారణ చేస్తుంది. సుమోటోగా కూడా విచారణ చేపట్టవచ్చు. నోటీసు ద్వారా పిలిపించి అనుసంధాన కర్త ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారు. జిల్లా మెజిస్ట్రేట్‌ హోదా కలిగిన అప్పిలేట్‌ అధికారి ట్రిబ్యునల్‌ తీర్పులపై న్యాయ సమీక్ష చేస్తారు. సీనియర్‌ సిటిజన్లను నిర్లక్ష్యం చేసిన వారికి 3 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

జిల్లాలో ఇటీవలిగుర్తుతెలియని వృద్ధుల మరణాలు
గత నెల 9న నంద్యాలలోని బంగారుపుట్ల వద్ద చిన్న చెరువులో 60 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది.  
గత నెల 20న కర్నూలు సమీప జొహరాపురం ఇందిరమ్మ కాలనీలో గడ్డపార చిన్న ఆంజనేయులు(50) అనారోగ్యంతో మృతిచెందాడు.
గత నెల 26న కర్నూలు కేవీఆర్‌ మహిళా కళాశాలసమీపంలో 55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు.
జూన్‌ 4న కర్నూలు టూటౌన్‌ పరిధిలో 65 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు.  

తిరుపతి ఘటన దారుణం
తిరుపతిలో ఆస్తి కోసం ఓ వృద్ధున్ని కొడుకు, కోడలు కొట్టిన ఉదంతం సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది. ఇలాంటి కొడుకులను కఠినంగా శిక్షించాలి. వృద్ధుల సంక్షేమ చట్టం–2007 ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు శిక్షార్హులు. ఈ చట్టం మేరకు తల్లిదండ్రులకు ప్రతి నెలా రూ.10వేల భృతి ఇవ్వాలి. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వమే వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి పోషించాలి.  – కృపావరం, జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు

లోక్‌అదాలత్‌లోదరఖాస్తు చేసుకోవాలి
వృద్ధ తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ హక్కుల కోసం లోక్‌ అదాలత్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  అలా చేస్తే వారి పిల్లలకు లోక్‌అదాలత్‌ నోటీసులు జారీ చేస్తుంది. ప్రభుత్వం కూడా ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌ ఏర్పాటు చేస్తుంది. వృద్ధ తల్లిదండ్రులకు జీతం అటాచ్‌మెంట్, ఆరోగ్య, శారీరక, మానసిక భద్రత కల్పిస్తుంది.  – ఎల్‌.హేమలతా లింగారెడ్డి,న్యాయవాది, కర్నూలు

Advertisement
Advertisement