పేట్రేగుతున్న బ్లేడ్ బ్యాచ్ | Sakshi
Sakshi News home page

పేట్రేగుతున్న బ్లేడ్ బ్యాచ్

Published Wed, Apr 20 2016 1:18 AM

Attempt to kidnap student

విద్యార్థి కిడ్నాప్‌కు యత్నం

 

పెనమలూరు : బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగాయి. ఇప్పటివరకు దాడులకు పాల్పడుతున్న వారు ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వారి నుంచి విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్నాడు.  పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన డిగ్రీ విద్యార్థి పరిమి మధుబాబు (22) విజయవాడలోని అమ్మమ్మ ఇంటికి కొద్ది రోజుల కిందట వచ్చాడు. మేనత్త వద్ద రూ.3 వేలు తీసుకుని తిరిగి తణుకుకు సోమవారం రాత్రి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను విజయవాడ బస్టాండ్ వద్ద బీరు తాగాడు. ఆ తరువాత ఆటో అతనిని పిలిచి మంచి హోటల్‌కు తీసుకెళ్లమన్నాడు. ఆటో బయలుదేరుతుండగా అందులో బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఎక్కారు.


వారు మధుబాబును బెదిరించి ఆటోను పెదపులిపాక కరకట్ట వద్దకు తీసుకువచ్చారు. అతని జేబులో ఉన్న సెల్‌ఫోన్, సొమ్మును దౌర్జన్యంగా లాక్కున్నారు. జేబులో నుంచి బ్లేడ్‌లు తీసి చంపుతామని బెదిరించారు. భయాందోళనకు గురైన మధుబాబు వారితో పెనుగులాడి తప్పించుకుని సమీపంలోని పంట పొలాల్లోకి పారిపోయి దాక్కున్నాడు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు అతని కోసం చీకట్లో గాలించి దొరకకపోవడంతో ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఆటోలో వచ్చిన వ్యక్తి సెల్‌ఫోన్ పెనుగులాటలో కిందపడి పోయింది. దీనిని మధుబాబు తీసుకుని పోలీసులకు అప్పగించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. పెనమలూరు పోలీసులు, సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement