గవర్నర్ను విచారిస్తున్న సీబీఐ అధికారులు | Sakshi
Sakshi News home page

గవర్నర్ను విచారిస్తున్న సీబీఐ అధికారులు

Published Wed, Jul 9 2014 11:32 AM

గవర్నర్ను విచారిస్తున్న సీబీఐ అధికారులు - Sakshi

హైదరాబాద్ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో గవర్నర్ నరసింహన్ను సీబీఐ అధికారులు బుధవారం విచారిస్తున్నారు. రాజ్భవన్లో ఆయనను సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. నరసింహన్ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. నరసింహన్‌ను కీలక సాక్షిగా సీబీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

2005 లో ఈ ఒప్పందం కుదిరినప్పుడు నరసింహన్ కేంద్ర ఐబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 2005 మార్చి ఒకటిన జరిగిన కీలక సమావేశంలో వీరిచ్చిన నివేదికలు కీలకమయ్యాయని సీబీఐ భావిస్తోంది.  ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీబీఐ అధికారుల బృందం గవర్నర్ ఇచ్చే వివరాలను సేకరించనుంది. ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ఎస్‌పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

3,700 కోట్ల రూపాయలకుపైబడి ఈ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే  పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ఎంకె నారాయణన్, గోవా మాజీ గవర్నర్ వాంఛూలను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా వాంఛూ ఎస్‌పీజీ చీఫ్‌గా కొనసాగారు. సీబీఐ విచారణ అనంతరం వారు తమ పదవులకు రాజీనామా చేశారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement