ఆటో దారిమళ్లించి దోపిడీ | Sakshi
Sakshi News home page

ఆటో దారిమళ్లించి దోపిడీ

Published Fri, Jul 25 2014 3:35 AM

ఆటో దారిమళ్లించి దోపిడీ - Sakshi

 పొదలకూరు:  పాఠశాలకు వెళుతున్న ఇద్దరు ఉపాధ్యాయినులను ఆటోలో ఎక్కించుకుని మార్గంమధ్యలో దారిమళ్లించి దోపిడీకి పాల్పడిన ఘటన గురువారం మండలంలోని తోడేరు రోడ్డులో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోడేరు గిరిజన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సడ్డా లావణ్య, మెయిన్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్‌కే ఫామిదా  నెల్లూరు-పొదలకూరు మెయిన్‌రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు ఆటో ఎక్కారు.
 
 కొంతదూరం వెళ్లిన తర్వాత ఎడమగట్టు కాలువ వద్ద ఆగంతుకులు కాలువ వెంబడి దారి మళ్లించారు. కేకలు వేసి ఎదురుతిరిగేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను వెనుక సీట్లో ప్రయాణికుడిలా ఉన్న యువకుడు వెంటనే కత్తిచూపి అరిస్తే పీక కోసేస్తానని బెదిరించాడు. కాలువ వెంబడి రెండు పర్లాంగుల దూరం తీసుకుని వెళ్లి ఓ గుంత వద్ద ఆటోను నిలిపి డ్రైవర్, ప్రయాణికుడిలా నటించిన ఆగంతకుడు, పక్కా ప్రణాళికతో గుంతలో సిద్ధంగా ఉన్న ముసుగు ధరించిన వ్యక్తి కలిసి ఉపాధ్యాయినుల వద్ద సుమారు 15 సవర్ల బంగారు నగలను లాక్కున్నారు.
 
 మంగళసూత్రం ఒక్కటి ఇవ్వండని లావణ్య ప్రాధేయపడినా దోపిడీ దొంగలు కనికరించకుండా అపహరించుకుని ఆటోలో వెళ్లారు. లావణ్య వద్ద సరుడు, ఉంగరాలు 2, గాజులు 2, కమ్మలు, ఫామిదా వద్ద నల్లపూసల దండ, కమ్మలు, ఉంగరాలు 2 దుండగులు దోచుకున్నారు. సెల్‌ఫోన్లతో సమాచారం అంది స్తారని ఉపాధ్యాయినుల వద్దనున్న హ్యాండ్ బ్యాగులను కూడా లాక్కుని వెళ్లారు. భయకంపితులైన టీచర్లు కాలువ వెంబడి నడుచుకుంటూ రోడ్డపైకి వచ్చి గ్రామంలోని పాఠశాలకు చేరుకుని సహోపాధ్యాయులు, గ్రామస్తులకు జరిగిన ఘటనను వివరించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్సై అంజిరెడ్డి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుని కేసునమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న మండలంలోని పలుపాఠశాలల ఉపాధ్యాయులు, యూనియన్ల నాయకులు వచ్చి పరామర్శించారు.
 
 ముసుగు వ్యక్తి
 స్థానికుడిగా అనుమానం
 ముసుగు ధరించిన వ్యక్తే దోపిడీకి సూత్రదారి అయి ఉంటాడని గ్రామస్తులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోడ్రైవర్, మరో వ్యక్తి స్థానికేతరులుగా భావిస్తున్నారు. ముసుగు ధరించిన వ్యక్తిని ఉపాధ్యాయినులు గుర్తిస్తారనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక రచించి బయటి వ్యక్తుల సహకారంతో దోపిడీకి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామని ఎస్సై తెలిపారు.
 
 అదే ఫక్కీలో వృద్ధురాలిని
 దోచుకున్న దుండగులు
 తోడేరు క్రాస్‌రోడ్డులో ఉపాధ్యాయినులను ఆటోలో ఎక్కించుకుని దారిదోపిడీకి పాల్పడిన దుండగులు అదే ఫక్కీలో సాయంత్రం మండలంలోని ఉలవరపల్లి సమీపంలో తాటిపర్తి గ్రామానికి చెందిన వృద్ధురాలిని దోచుకున్నారు. నెల్లూరులో నివాసం ఉంటున్న తాటిపర్తికి చెందిన అక్కెం శివకుమారి స్వగ్రామానికి వచ్చి నెల్లూరుకు బయలుదేరింది. పొదలకూరు వచ్చేందుకు తాటిపర్తి బస్టాండ్‌లో ఆటో ఎక్కింది. అదే ఆటోలో ప్రయాణికుడు మార్గంమధ్యలో షుగర్‌ఫ్యాక్టరీ వద్ద రూ.10 ఆటో డ్రైవర్‌కు చెల్లించి దిగిపోయాడు.
 
 పయాణికుడిలా నటించి ఆటో దిగిపోయిన వ్యక్తి మరో యువకుడ్ని పల్సర్ బైక్‌లో ఎక్కించుకుని ఆటోను వెంబడించాడు. ఆటో ఉలవరపల్లి ఫారెస్ట్ నర్సరీ వద్దకు వచ్చే సమయానికి రోడ్డు మళ్లించాడు. శివకుమారి ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించడంతో నిమ్మకాయల బస్తాలు వేసుకోవాలని డ్రైవర్ చెప్పాడు. వెంటనే వెనుక బైక్‌లో వస్తున్న ఇద్దరు ఆగంతుకులు చెట్ల మధ్యకు వచ్చి వృద్ధురాలిని బెదిరించి ఆమె చీరతో చేతులు రెండూ కట్టేసి కర్చీఫ్ నోట్లో కుక్కి బంగారు సరుడు, రెండు గాజులు, మూడు ఉంగరాలు మొత్తం 8 సవర్ల బంగారు నగలను అపహరించుకుని వెళ్లారు.
 
 బాధితురాలు రోడ్డుపైకి వచ్చి షుగర్‌ఫ్యాక్టరీ బస్సును నిలపడంతో వారు ఆమె చేతికట్లు విప్పారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై అంజిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి గాలించారు. శివకుమారి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. తోడేరు సమీపంలో దోపిడీకి పాల్పడిన వారే వృద్ధురాలిని దోచుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
Advertisement