యువతలో హార్ట్‌ సర్క్యుట్‌ | Sakshi
Sakshi News home page

యువతలో హార్ట్‌ సర్క్యుట్‌

Published Thu, May 24 2018 12:54 PM

Awareness On Heart Strokes in Youth Krishna - Sakshi

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో గుండె జబ్బులకు గురైన వారిని చూసేవాళ్లం. దశాబ్ద కాలంగా మధ్యవయస్సు వారు గుండెజబ్బులకు గురవుతున్నారు. తాజాగా యువతలో 20 ఏళ్లకే గుండె అరెస్ట్‌(షార్ట్‌సర్క్యుట్‌) వంటి కారణాలతో మృతి చెందడం ఆందోళన కలిగించే అంశంగా చెపుతున్నారు. దీనిపై కథనం...

లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ కుమారుడు 21ఏళ్లకు కార్డియాక్‌ అరెస్ట్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. అంత చిన్న వయస్సులో గుండెజబ్బుతో మృతి చెందడం కొంత ఆందోళన కలిస్తుంది. అంతేకాదు. ఇద్దరు ముగ్గురు మెడికల్‌ స్టూడెంట్స్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో తమ వద్దకు వచ్చినట్లు విజయవాడకు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ పి.రమేష్‌బాబు చెబుతున్నారు. గుండె జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో గుండెపోటుకు గురై సకాలంలో ఆస్పత్రికి రాక ముగ్గురు వైద్యులు మృతి చెందడం ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుతం యువతతోపాటు, 30 నుంచి 40 ఏళ్ల వయస్సులో అధికంగా గుండె జబ్బులకు గురవుతున్నారు. ఒకప్పుడు స్త్రీలలో సైతం 70 ఏళ్లు దాటిన వారిలో గుండె జబ్బులు వచ్చేవని, ప్రస్తుతం 35 ఏళ్లకే వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా అన్ని వర్గాల్లో గుండె జబ్బులు నమోదవుతున్నాయి.

కారణాలివే...
చిన్న వయస్సులో గుండెజబ్బులకు రెండు రకాల కారణాలున్నాయి. వారి ఫ్యామిలీ హిస్టరీ, జన్యుపరమైన లోపాలు ఒక కారణం. గుండె కండరాలు దలసరిగా ఉండటం(సాధారణంగా 11 ఎంఎం ఉండాలి. కానీ 20 ఎంఎం ఆపైన ఉండటం), గుండెలోపల ఎలక్ట్రికల్‌ వైరింగ్, కరెంట్‌లో లోపాలతో షార్ట్‌సర్క్యుట్‌కు గురవడం, రక్తనాళాలు కుడి వైపున ఉండాల్సినవి ఎడమ వైపునకు తారుమారుగా పుట్టుకతోనే ఉన్నా గుర్తించకపోవడం వంటిగా పేర్కొంటున్నారు. ఇలాంటి వారు టెన్షన్స్, రెస్ట్‌ లేకుండా పనిచేయడం వంటి సందర్భాల్లో హార్ట్‌ షార్ట్‌ సర్క్యుట్‌కు గురై సడన్‌డెత్‌కు గురవుతారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడంతో 30, 40 శాతం పూడికలు ఉన్నా అవి చిట్లీ రక్తం గడ్డ కట్టి ప్రమాదకరంగా మారుతుంది. కొందరిలో 80 శాతం పూడికలు ఉన్నా ప్రమాదం కావని, కానీ కొందరిలో 30 శాతం ఉన్నా ప్రమాదకరంగా మారతాయంటున్నారు.–డాక్టర్‌ పోతినేని రమేష్‌ బాబు, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పుట్టిన వెంటనే గుండె పరీక్షలు చేయించడంతోపాటు, ఇరవై ఏళ్లు దాటిన వారు ప్రతి ఒక్కరూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. గుండెలోపాలు ఉన్నట్లు గుర్తించి మందులు వాడటంతోపాటు, సరైన ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం, యోగా వంటివి చేయడం ఎంతో అవసరం. సరైన ఆహార అలవాట్లు కూడా ఎంతో ముఖ్యం. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. తమ కుటుంబంలో ఎవరికైన గుండెజబ్బులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు ముందస్తు చర్యలు తీసుకోవాలి.

అవగాహన ఎంతో ముఖ్యం
నయం చేయగల గుండె జబ్బులతో బాధపడే వారు సరైన అవగాహన లేక మృత్యువాత పడడం బాధాకరమైన విషయం. ప్రస్తుతం చిన్నవయస్సులో హార్ట్‌ షార్ట్‌ సర్క్యుట్‌కు ప్రధానంగా జన్యుపరమైన సమస్య కారణంగా చెప్పవచ్చు. వైద్యులకు సైతం గుండెపోటు, గుండెజబ్బులపై సరైన అవగాహన ఉండటం లేదు. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే ఈసీజీ తీయడం ద్వారా గుండెపోటును నిర్ధారించవచ్చు. టెలీ, ఈసీజీ, టెలీమెడిసిన్‌ సెంటర్‌ల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చు. యువతలో గుండె షార్ట్‌సర్క్యుట్‌లకు సైతం తక్షణ వైద్యంతో నివారించవచ్చు. ప్రివెంటీవ్‌గా గుర్తిస్తే నయం చేయగల వారు కూడా నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ జరగడం లేదు. గుండె రక్తనాళాల్లోని కాల్ఫియం స్కోరు ఆధారంగా గుండెపోటు వచ్చే లక్షణాలను ముందుగా గుర్తించవచ్చు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా నైస్‌ గైడ్‌లైన్స్‌ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

Advertisement
Advertisement