ఆయుర్వేదానికి విభజన కష్టాలు | Sakshi
Sakshi News home page

ఆయుర్వేదానికి విభజన కష్టాలు

Published Thu, Aug 27 2015 2:28 AM

ఆయుర్వేదానికి విభజన కష్టాలు

రాష్ట్రవిభజనతో మందుల సరఫరాకు బ్రేక్
హోమియో కేంద్రాలదీ అదేబాట
సిబ్బంది కొరతా సమస్యే..
 
 వెంకటగిరి : ప్రాచీన భారతంలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో విశిష్టత ఉంది.ఎన్నోదీర్ఘకాలిక వ్యాధులను మూలికలతో నయం చేసిన ఆయుర్వేద వైద్యం నేడు క్రమంగా ఆదరణ కోల్పోతోంది. ఆయుర్వేద వైద్యశాలలతోపాటు ఆయుష్ కేంద్రాలకు బాలరిష్టాలు తప్పడం లేదు. ప్రాచీన వైద్యంపై అవగాహన లేకపోవడం, అల్లోపతి వైద్యంపై మోజు పెరగడంతో సనాతన ఆయుర్వేదవైద్యం దీనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలు ఆయుర్వేదవైద్యంపై ఆసక్తి కనబరచకపోవడంతో ప్రభుత్వం సైతం ఆయుర్వేద వైద్యశాలలకు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

అంతేగాక రాష్ట్రవిభజన అనంతరం ఆయుర్వేద వైద్యకేంద్రాలతోపాటు హోమియోవైద్యశాలలకు మందు ల సరఫరా నిలిచిపోయింది. తాజాగా మందుల సరఫరా కోసం ఇండెంట్ పెడితే నగదు చెల్లించి తీసుకోవాల్సిందే అంటూ హైదరాబాద్ రామంతపూర్‌లో ఆయుర్వేద, హోమియో మందుల సరఫరా కేంద్రం అధికారులు తేల్చి చెప్పడం, రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడ ంతో మందుల సరఫరాలో సమస్యలు ఎదరవుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న వైద్యశాలలు సిబ్బంది కొరత, అరకొర వసతులతో సతమతమవుతున్నాయి.

 నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి:
 నియోజకవర్గంలోని రాపూరు ఆయుర్వేద ఆసుపత్రికి భవనం లేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ గదిలో నిర్వహిస్తున్నారు. కలువాయి మండలం కుల్లూరులో ఉన్న హోమియోవైద్యశాలకు నెల్లూరు నుంచి వారంలో మూడు రోజులు మాత్రమే రోగులకు సేవలందిస్తున్నారు. సైదాపురం మండలం చాగణం, చావలిలలో ఉన్న ఆయుష్‌కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో వెంకటగిరి హోమియోవైద్యుడు ఓబులేసు డి ప్యుటేషన్‌పై వారంలో రెండు రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. వెంకటగిరి హోమియో వైద్యశాల వైద్యుడు పలు హోమియో వైద్యశాలలకు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తూ సోమ, గురువారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. మోపూరు ఆసుపత్రి మూతపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం సిబ్బంది కొరత తీర్చి అన్ని రకాల వసతులు కల్పిస్తే పూర్వ వైభవం సాధ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు.

  ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు
 హోమియో వైద్యం వల్ల రోగులకు ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆయుర్వేద, హోమియో వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. వెంకటగిరి ప్రాంతంలో కీళ్లనొప్పులు , చర్యవ్యాధులకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వారికి అవసరమైన మందులు డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా కావడం లేదు.
 - ఓబులేసు, హోమియోవైద్యుడు, వెంకటగిరి

Advertisement
Advertisement