ఆజాద్ ఎన్‌కౌంటర్ బూటకం | Sakshi
Sakshi News home page

ఆజాద్ ఎన్‌కౌంటర్ బూటకం

Published Tue, Feb 18 2014 2:35 AM

azad encounter drama

 ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :
 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ ఉరఫ్ ఆజాద్, జర్నలిస్టు హేమచంద్రపాండే ఎన్‌కౌంటర్ బూటకమని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో సాక్షిగా సోమవారం జిల్లా క్రిమినల్ కోర్టుకు ఆయన హాజరయ్యారు. మెజిస్ట్రేట్ మేరి సారదనమ్మ ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆజాద్, హేమచంద్ర పాండేలను పోలీసులు దారుణంగా కాల్చిచంపారని పేర్కొన్నారు. తనను కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపించేందుకు మధ్యవర్తిగా ఉండాలని కోరినట్లు తెలిపారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం తనతో స్వయంగా మాట్లాడడంతో శాంతి చర్చలకు ఒప్పుకున్నాని పేర్కొన్నారు. ఆ తర్వాత 72 గంటలు కాల్పుల విరమించుకున్నామని, మావోయిస్టులు అడవి నుంచి బయటకు రావాలని ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది మావోయిస్టులు బయటకు వచ్చారన్నారు.
 
 వాంకిడి అడవుల్లో కాల్చివేత
 మావోయిస్టు నేత ఆజాద్ కూడా బయటకు రాగానే పోలీసులు ఆయనను నాగ్‌పూర్‌లో బంధించి ఆదిలాబాద్‌లోని వాంకిడి అడవులకు తీసుకొచ్చి ఆజాద్‌తోపాటు జర్నలిస్టు హేమచంద్ర పాండేను కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించాలని చెప్పడంతో ఇక్కడ న్యాయపోరాటం చేసేందుకు దీనికి బాధ్యులైన వారిపై పిటిషన్ వేయడం జరిగిందన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ జరిగిందని కోర్టులో వివరించినట్లు తెలిపారు. ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తుందన్నారు. తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ నిజమైన ఎన్‌కౌంటర్‌గా చూపించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసును ప్రత్యేక న్యాయ విచారణ బృందంతో దర్యాప్తు చేపట్టాలని కోరారు. అనంతరం ఆజాద్ భార్య పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్టు ఎన్‌కౌంటర్‌లు రాజకీయ హత్యలేనని పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఈనెల 20న కోర్టుకు హాజరుకావాలని వాయిదా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. వీరితోపాటు పద్మ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ ఉన్నారు.
 
 ‘తెలంగాణ’ తప్పక వస్తుంది..
 తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పాటవుతుందని సామాజిక కార్యకర్త అగ్నివేశ్ అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు.
 
 ఈ విషయంలో బాబు తనను కూడా కలిసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ  రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాఫియా పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణం గురించి చర్చించారు.
 

Advertisement
Advertisement