బాబు ప్రకటిస్తే రుణాలు రెన్యువల్‌కు సిద్ధమే.. | Sakshi
Sakshi News home page

బాబు ప్రకటిస్తే రుణాలు రెన్యువల్‌కు సిద్ధమే..

Published Thu, Nov 6 2014 1:49 AM

బాబు ప్రకటిస్తే రుణాలు రెన్యువల్‌కు సిద్ధమే..

సొసైటీ అధ్యక్షుల స్పష్టీకరణ..
 
 కొరిటెపాడు(గుంటూరు): ఎన్నికల్లో రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నామని, రుణాలు రెన్యువల్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రకటనచేస్తే అలా చేయడానికి సిద్ధమేనని కొన్ని పీఏసీఎస్‌ల అధ్యక్షులు సవాల్ చేశారు. నగరంలోని జిల్లా కేంద్ర సహకార  బ్యాంకు కార్యాలయంలో బుధవా రం పీఏసీఎస్‌ల అధ్యక్షులతో సమావేశం జరిగింది. తొలుత చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం రుణమాఫీకి ప్రయత్నాలు చేస్తోందని, ఈలోగా రైతులు అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని సూచించారు.

దీనికి పలు సొసైటీల అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాయపూడి సొసైటీ అధ్యక్షుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరి  మాట్లాడుతూ లక్ష రూపాయలకు రూ.15 వేల మేర వడ్డీ భారం పడుతుందని, పాత రుణాలు కట్టకపోతే కొత్త రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఇదంతా ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ పుణ్యమేనని మండిపడ్డారు. రైతులు తీసుకున్న రుణాలను వడ్డీతో కలిపి రెన్యువల్ చేయటం మంచి పద్ధతి కాదన్నారు. రుణమాఫీ చేయలేకపోతున్నామని, రుణాలను రెన్యువల్ చేసుకోవాలని చంద్రబాబుతో ప్రకటన ఇప్పిం చాలని డిమాండ్ చేశారు.

చైర్మన్ ముమ్మనేని స్పందిస్తూ తొలి విడత కొంతమొత్తం చెల్లించి మిగిలిన మొత్తానికి బాండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి చెల్లించిన రుణాలపై ఎలాంటి వడ్డీ ఉండదని, ఏప్రిల్ 1 నుంచి ఏడు శాతం, సెప్టెంబర్ ఒకటి నుంచి 11.75 శాతం వడ్డీ పడుతుందని వివరించారు. తర్వాత 13 శాతం వడ్డీ పడే అవకాశం ఉన్నందున వడ్డీ చెల్లించి రైతులు కొత్త రుణాలు పొందేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తొలి విడతగా జమచేసే మొత్తాన్ని రైతులకు అందిస్తామన్నారు. బ్యాంక్ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, సీఈవో మురళికృష్ణ, గుంటూరు డివిజన్‌లోని సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement