చట్టానికి తలవంచిన తల్లి ప్రేమ! | Sakshi
Sakshi News home page

చట్టానికి తలవంచిన తల్లి ప్రేమ!

Published Fri, Jun 20 2014 1:42 AM

చట్టానికి తలవంచిన తల్లి ప్రేమ! - Sakshi

శ్రీకాకుళం క్రైం: పెంచిన ప్రేమను చట్టం కాదంది. అనధికార దత్తత చెల్లదంటూ ఓ బిడ్డను పెంపుడు తల్లి నుంచి వేరుచేసి కన్నతల్లి చెంతకు చేర్చింది. ఎల్.ఎన్.పేటలోని రోటరీనగర్‌లో నివాసముంటున్న ప్రసాదం గోపాలం, అనసూయ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఆ దంపతులు వంశోద్ధారకుడి కోసం ఎదురుచూశారు. నాలుగో సంతానంగా ఈ నెల 15న ఆడపిల్లే జన్మించడంతో నలుగురిని ఎలా పెంచగలమని ఆవేదన చెందారు.

శ్రీకాకుళం శివారు వాంబే కాలనీలో నివాసముంటున్న దూరపు బంధువులు బి.రామలింగస్వామి, మహేశ్వరి దంపతులకు పిల్లలు లేరని తెలుసుకున్నారు. ఎవరినైనా పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియటంతో వారితో మాట్లాడారు. వారు ఇష్టపడడంతో అప్పుడే పుట్టిన శిశువును అప్పగించేశారు. ఐదు రోజులుగా రామలింగస్వామి దంపతులు ఆ బిడ్డను ప్రేమతో సాకుతున్నారు. పిల్లలు లేని లోటు తీరిందని ఆనందంగా గడుపుతున్నారు.
 
అవిరైపోయిన ఆనందం..
ఇంతలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్‌లైన్ సిబ్బందికి ఫోన్ చేసి రామలింగస్వామి దంపతులు శిశువును అనధికారికంగా దత్తత తీసుకున్న విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు విచారణ జరిపి వాస్తవం తెలుసుకున్నారు. చైల్డ్‌లైన్ సభ్యురాలు ఎస్.గీత, రామలింగస్వామి దంపతులకు చట్టం గురించి వివరించి శిశువును ఐసీడీఎస్ కార్యాలయానికి అప్పగించారు. ఐసీడీఎస్ అధికారులు శిశువు కన్నవారిని పిలిపించారు. పాపను అనధికారికంగా దత్తత ఇవ్వటం సరికాదని, పెంచలేకపోతే శిశువిహార్‌కు అప్పగించాలని సూచించారు.
 
పాప తల్లిదండ్రులు ప్రసాదం గోపాలం, అనసూయలు మాట్లాడుతూ పాపను రామలింగందంపతులకే అప్పగిస్తామని, లేకుంటే తామే పెంచుకుంటామని తేల్చిచెప్పారు. శిశువును వేరొకరికి కిచ్చేందుకు అంగీకరించేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో శిశువును శిశువిహార్‌లో ఉంచి ఈ నెల 27న రమ్మని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. శిశువును శిశు విహార్‌లో ఉంచటమేమిటంటూ అక్కడకు చేరుకున్న సాక్షి ఛానల్ ప్రతినిధి అధికారులను నిలదీయడంతో కన్న తల్లిదండ్రులకు అప్పగించి పంపారు. ఈ నెల 27న హాజరు కావాలని ఇరువురు దంపతులకు ఐసీడీఎస్ ఏపీడీ పి.భవాని సూచించారు. కాగా ఐసీడీఎస్ అధికారులు చట్టం పేరుతో తమకు అన్యాయం చేశారంటూ రామలింగస్వామి దంపతులు వాపోయారు. వీరితో వచ్చిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement