బాలచందర్ పెట్టిన పేరే జీవా | Sakshi
Sakshi News home page

బాలచందర్ పెట్టిన పేరే జీవా

Published Thu, Jan 1 2015 6:00 AM

బాలచందర్ పెట్టిన పేరే జీవా - Sakshi

నన్ను నటుడిగా తీర్చిదిద్దింది... సినీ రంగానికి జీవాగా పరిచయం చేసింది ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ అని నటుడు జీవా తెలిపారు. పారిశ్రామికవేత్త పుట్టగుంట వెంకటసతీష్‌కుమార్ పరిశ్రమలో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం హనుమాన్‌జంక్షన్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వెయ్యికిపైగా సినిమాల్లో నటించి అన్ని వయసుల వారి ఆదరాభిమానాలు అందుకోవడం తన అదృష్టమన్నారు. తనకు నటుడిగా జన్మనిచ్చిన దర్శకుడు కె.బాలచందర్ మరణం తనకు 2014లో పెను విషాదం మిగిల్చిందన్నారు.   
 
ప్రశ్న : జీవాగా బాల చందర్ పరిచయంచేశారని అంటున్నారు.. మీ అసలు పేరు ఏమిటి?
జవాబు : నా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. మహాదర్శకుడు బాలచందర్ పెట్టిన పేరుతో ప్రేక్షకులకు చేరువయ్యా.
 
ప్రశ్న : మీ మొదటి చిత్రం ఏది?
జవాబు : ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘తొలి కోడి కూసింది’.
 
ప్రశ్న : ఆయన చిత్రానికి ఎలా ఎంపికయ్యారు?
జవాబు : ‘తొలి కోడి కూసింది’ సినిమా కోసం నటులు కావాలని పత్రికల్లో ప్రకటన వచ్చింది. అది చూసిన నా స్నేహితులు నా ఫొటోలు పంపించారు. గుట్టలుగుట్టలుగా ఫొటోలు వచ్చినా సినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఒక్కరినీ కూడా ఎంపికచేయలేదు. ఆ విషయాన్నే బాలచందర్‌కు చెప్పారు. సంస్థ కార్యాలయం నుంచి వెళ్తున్న బాలచందర్‌కు ఫొటోల గుట్టల్లో రెండు కళ్లు కనిపించాయి. ఆ ఫొటోలో కుర్రాడికి కబురుపెట్టండని చెప్పడంతో సంస్థ ప్రతినిధులు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఆయనే నా పేరు కూడా మార్చి జీవాగా పరిచయం చేశారు.
 
ప్రశ్న : మీరు తృప్తిపడింది విలన్‌గానా, హాస్యనటుడిగానా?
జవాబు : రెండు పాత్రలూ రెండు కళ్లు వంటివి. ప్రతి ఒక్కరిలో అన్ని కోణాలూ ఉంటాయి. అయితే దర్శకుడు తమకు కావాల్సిన విధంగా నటుడిని మలుచుకుంటాడు. వంశీ, కృష్ణవంశీ, పూరిజగన్నాథ్ తదితర దర్శకులు నన్ను హాస్యనటుడిగా తీర్చిదిద్దారు.
 
ప్రశ్న : ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం...

జవాబు : నూతన సంవత్సరంలో ఎదుటి మనిషికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు. కీడు మాత్రం తలపెట్టవద్దు. తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
 

Advertisement
Advertisement