మత్తు దిగుతోంది..! | Sakshi
Sakshi News home page

మత్తు దిగుతోంది..!

Published Sat, Sep 21 2019 12:47 PM

Ban Alcohol Workout in Krishna - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా ,మచిలీపట్నం :   రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం వైపు ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్పలితాలనిస్తున్నాయి. అధికారంలోకి వచ్చీరాగానే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపడం.. దశల వారీ మద్య నిషేదంలో భాగంగా ఏటా 20 శాతం చొప్పున షాపులను తగ్గించడం వంటి చర్యలు మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి.

నూతన పాలసీ అమలు కాకముందే...
నూతన మద్యం పాలసీ ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాక ముందే మద్యం అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్‌ నుంచి 20 శాతం దుకాణాలకు కోత పెడుతూ, మిగిలిన షాపులను ప్రభుత్వమే నిర్వహించేందుకు ఓ వైపు సన్నాహాలు చేస్తోంది. మరో వైపు గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దొరకని చోటు అంటూ ఉండేది కాదు. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరికేది కాదు కానీ.. మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరికేది. ప్రతి మద్యం షాపునకు కనీసం 10 నుంచి 25 వరకు బెల్ట్‌ షాపులుండేవి. ఏటా మద్యం విక్రయాలు 10 నుంచి 20 శాతం మేర పెరుగుతూ ఉండేవి. అంతే కాదు టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు పెంచేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వాదాయానికి గండి పడినా ఫర్వా లేదు.. అక్కా చెల్లమ్మలకు తానిచ్చేన హామీని అమలు చేసి తీరుతానని సీఎం వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో జిల్లాలో ఒక్కటంటే ఒక్క బెల్టు షాపు కూడా బూతద్దం పెట్టి వెతికినా కన్పించని పరిస్థితి నెలకొంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ వ్యత్యాసం కన్పిస్తోంది.

1.10 లక్షల కేసుల విక్రయాలు తక్కువగా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగష్టు వరకు జిల్లాలో ఐఎంఎల్‌ మద్యం గతేడాది 16,48,742 కేసుల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 14,85,140 కేసుల విక్రయాలు జరిగాయి. వీటిలో మచిలీపట్నం యూనిట్‌ పరిధిలో గతేడాది 5,98,379 కేసుల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 5,34,842 కేసుల విక్రయాలు జరిగాయి. విజయవాడ యూనిట్‌ పరిధిలో గతేడాది 10,50,363 కేసుల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 9,50,298 కేసుల విక్రయాలు జరి గాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌ నుంచి ఆగష్టు వరకు జరిగిన అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే ఐఎంఎల్‌ మద్యం గతేడాది 10,08,042 కేసుల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 9,00,578 కేసుల విక్రయాలు జరిగాయి. మచిలీపట్నం యూనిట్‌లో గతేడాది 3,66,443 కేసుల ఐఎంఎల్‌ మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 3,20,647 కేసుల విక్రయాలు జరిగాయి. మొత్తంగా జూన్‌ నుంచి ఆగష్టు వరకు గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1.10 లక్షల కేసుల ఐఎంఎల్‌ మద్యం విక్రయాలు తగ్గాయి.

పెరిగిన బీరు విక్రయాలు...
కాగా మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గగా, బీరు అమ్మకాలు మాత్రం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7,79,210 కేసులు అమ్మగా, ఈ ఏడాది 9,37288 కేసుల విక్రయాలు జరిగాయి. ఈ విధంగా మద్యం అమ్మకాలు గతేడాదితో పోల్చుకుంటే 10 శాతం తగ్గగా, బీరు అమ్మకాలు మాత్రం 19 శాతం మేర పెరిగాయి. ఏప్రిల్‌ నుంచి ఆగష్టు వరకు విక్రయాలు గతేడాది 546.15 కోట్లు కాగా, ఈ ఏడాది 608.40 కోట్లు నమోదయ్యాయి. ఇక జూన్‌ నుంచి చూస్తే గతేడాది అమ్మకాలు రూ.328.78 కోట్లు కాగా, ఈ ఏడాది 364.70 కోట్లుగా నమోదయ్యాయి.

బెల్టుషాపుల రద్దు ప్రభావమే
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. దశల వారీగా మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించింది. జిల్లాలో ఒక్క బెల్టుషాపు కూడా లేకుండా చేశాం. గతంలో కూడా ఇదే రీతిలో తొలగించేవాళ్లం కానీ కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఏర్పాటు చేసేవారు. ఈ సారి ఆ పరిస్థితి కన్పించడం లేదు. మద్యం షాపుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాదే 20 శాతం షాపులు తగ్గుతున్నాయి. అక్టోబర్‌ 1 నుంచి ప్రభుత్వ అవుట్‌లెట్స్‌ రాబోతున్నాయి. బెల్టు షాపుల తొలగించడం వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తుంది.         
– మేడికొండ మనోహ,   ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, మచిలీపట్నం

Advertisement
Advertisement