నోటీసులిచ్చారు | Sakshi
Sakshi News home page

నోటీసులిచ్చారు

Published Sun, Dec 7 2014 12:56 AM

నోటీసులిచ్చారు - Sakshi

రుణమాఫీపై ఆర్భాటంగా చంద్రబాబు ప్రకటన
మరోపక్క రైతులకు బ్యాంకుల నుంచి వేలం నోటీసులు
ఆందోళనలో అన్నదాతలు
విజయోత్సవాల పేరుతో టీడీపీ నేతల అత్యుత్సాహంపై మండిపడుతున్న రైతులు

హామీ నిలబెట్టుకున్నాం.. రైతు రుణమాఫీ చేస్తున్నాం.. అంటూ చంద్రబాబు ప్రకటన చేసి రెండు రోజులు కూడా గడవలేదు.. రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. రుణాలు వెంటనే చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామనేది అందులో సారాంశం. ఇంకోపక్క రుణాలు మాఫీ అయిపోయినట్లుగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం రైతులను విస్మయానికి గురిచేస్తోంది.
 
కోడూరు : ఒకపక్క రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చేస్తుంటే.. మరోపక్క రుణాలు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామంటూ బ్యాంకుల నుంచి తమకు నోటీసులు పంపుతున్నారని రైతులు వాపోతున్నారు. కోడూరుకు చెందిన జమ్మలమడక బాలకృష్ణప్రసాద్ గత సంవత్సరం కేడీసీసీ బ్యాంకులో తనకున్న ఎకరం 50 సెంట్ల భూమిలో సాగు కోసం బంగారు అభరణాలు కుదవపెట్టి రూ.16 వేలు పంట రుణం పొందాడు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయంపై తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానంటూ ప్రచారం నిర్వహించడంతో బాలకృష్ణ ప్రసాద్ బ్యాంక్‌లో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని, తీసుకున్న అప్పు చెల్లించలేదు. బ్యాంకులో తీసుకున్న రూ.50 వేల లోపు వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయని ఈ నెల నాలుగున ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో బాలకృష్ణప్రసాద్ ఇక తనకు రుణమాఫీ వర్తిస్తుందంటూ సంబరపడ్డాడు. శుక్రవారం సాయంత్రం తీసుకున్న అప్పు చెల్లించని పక్షంలో బంగారు ఆభరణాలు వేలం వేస్తామంటూ కేడీసీసీ బ్యాంక్ అధికారులు బాలకృష్ణప్రసాద్‌కు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న బాలకృష్ణప్రసాద్ బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. ‘మాకు రుణమాఫీపై ఏవిధమైన సమాచారమూ అందలేదు.. తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించని పక్షంలో బంగారం వేలం వేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చినట్లు బాలకృష్ణప్రసాద్ తెలిపారు.

మరికొంతమందికీ నోటీసులు...

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తమకూ ఇదే విధంగా నోటీసులు అందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే రుణమాఫీ చేస్తాడని సంబరపడుతుంటే ఇలా నోటీసులు పంపడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
టీడీపీ సంబరాలతో ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు...

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం ధర్నా నిర్వహిస్తే, తెలుగుదేశం పార్టీ నాయకులు రుణమాఫీ చేయగల సత్తా చంద్రబాబుకే ఉందంటూ జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన రాకుండానే.. రుణమాఫీ అయిపోయిందంటూ టీడీపీ శ్రేణులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని, బాణాసంచా కాల్చడంతో ప్రజలు టీడీపీ అత్యుత్సాహాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. ప్రజల పక్షాన పోరాడే నేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ధర్నాను చూసి ఓర్వలేకే.. టీడీపీ నేతలు హామీలు నెరవేర్చకపోయినా విజయోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
 

Advertisement
Advertisement