నవ్విపోదురు గాక..! | Sakshi
Sakshi News home page

నవ్విపోదురు గాక..!

Published Thu, May 4 2017 11:49 AM

నవ్విపోదురు గాక..! - Sakshi

► నిష్క్రియపర్వంలో బాపట్ల  రెవెన్యూ శాఖ
► ప్రతిపాదనల విషయంలో ముందుకుపడని అడుగులు
► రెండేళ్లు పూర్తయినా ఆదాయ పన్నులశాఖకు  కేటాయించని స్థలం
► డంపింగ్‌యార్డు స్థలానికి మంగళం..?


బాపట్ల: మండలంలో ఒక్క సెంటు స్థలం కావాలన్నా మండల రెవెన్యూ శాఖ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తోంది. గుడిసె వేసుకునేందుకు పేదోడు జానెడు స్థలం కోరినా.. ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి గజం స్థలం కావాలన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. గట్టిగా అడిగితే ఎక్కడ లేని నిబంధనలన్నీ చెబుతూ తప్పించుకు తిరుగుతోంది.

భూమార్పిడికి సంబంధించిన అనుమతుల విషయాలు, వివాదాస్పద భూములకు సంబంధించన అనమతుల విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇప్పటికే ఆ శాఖ విమర్శలపాలవుతోంది. అయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న రీతిలో దులుపేసుకుంటోంది.

రెవెన్యూ అలసత్వానికి నిదర్శనాలివీ...!
పట్టణంలోని ఎక్సైజ్‌ కార్యాలయం పక్కన గతంలో క్వార్టర్లుగా ఉపయోగించిన స్థలాన్ని మార్కెట్‌ ధర ప్రకారం ఆదాయ పన్నుల శాఖకు కేటాయించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 25 సెంట్లలో భవన నిర్మాణానికి సంబంధిత శాఖ సిద్ధపడింది. సర్వే, భూ వివరాల ప్రకారం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మార్కెట్‌ ధర నిర్ణయించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నామని ఆర్డీవో జి.నరసింహులు, తహశీల్దార్‌ టి.వల్లయ్య, ఆదాయ పన్నులశాఖ అధికారులు దాసు, సుబ్బారావు రెండేళ్ల క్రితం స్థలాన్ని పరిశీలించారు.

ఆదాయ పన్నులశాఖ రెవెన్యూ శాఖకు డబ్బు చెల్లించేందుకూ సిద్ధమైంది. అయితే.. రెవెన్యూ అధికారులు మాత్రం రేపూ మాపు అంటూ ఆ ఫైల్‌ను మూలనపెట్టింది. వెదుళ్లపల్లిలో వికలాంగుల కాలనీ పక్కన కొందరు, మార్కెట్‌యార్డు ఎదురుగా మరికొందరు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. వారికి నివేశన స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వారి సంగతిని రెవెన్యూ శాఖ పట్టించుకున్న దాఖలాలే లేవు. హిందూ శ్మశాన వాటికలో కొందరు పాగా వేసినా తీసుకున్న చర్యలు శూన్యం..

లక్షలు చెల్లించినా డంపింగ్‌యార్డుకు స్థలం లేదు..
బాపట్ల మున్సిపాలిటీ అవసరమైన డంపింగ్‌ యార్డుకు స్థలం చూపించడంలో రెవెన్యూ శాఖ అలసత్వం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని ఓ స్థలానికి మార్కెట్‌ విలువకు తగిన విధంగా రూ.15 లక్షలు కూడా చెల్లింపులు పూర్తయ్యాయి. అయిన్పప్పటికీ రెవెన్యూ అధికారులు కదలకపోవడంతో పని జరగలేదు. ప్రస్తుతం పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారమే దర్శనమిస్తోంది.

ఐదేళ్ళ క్రితం అప్పటి కలెక్టర్‌ రామాంజనేయులు జోక్యం చేసుకుని రెవెన్యూ అధికారులపై  మండిపడ్డారు. వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే డంపింగ్‌యార్డుకు మాత్రం స్థలం కేటాయించలేకపోతున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పని జరగలేదు. చెల్లించిన నగదు కూడా మునిసిపాలిటీకి ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు..
ఆదాయ పన్నుల శాఖకు సంబంధించిన ఫైల్‌ తెనాలి ఆర్డీవో వద్ద ఉంది. అక్కడి నుంచి ఫైల్‌ వచ్చిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా హిందూ శ్మశానవాటిక వద్ద స్థలాన్ని ఖాళీ చేయించేందుకు మునిసిపల్‌ అధికారులకు నివేదిక పంపాం. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటాం.      – తహశీల్దార్‌ టి.వల్లయ్య

Advertisement
Advertisement