'అభయ' కేసులో బార్ అసోసియేషన్‌ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం | Sakshi
Sakshi News home page

'అభయ' కేసులో బార్ అసోసియేషన్‌ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం

Published Wed, Oct 23 2013 8:25 PM

'అభయ' కేసులో బార్ అసోసియేషన్‌ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం

సుమారు ఏడాది క్రితం దేశ రాజధానిలో 'నిర్భయ' ఉదంతాన్ని పోలిన మరో దుర్ఘటన రాష్ట్ర రాజధానిలో జరగటం సభ్య సమాజాన్ని కలవరపాటుకి గురిచేసింది. 'అభయ 'గా పోలీసులు వ్యవహరిస్తున్న ఈ కేసులో నేర తీవ్రత విషయంలో తేడా ఉన్నప్పటికీ, ఆ అఘాయిత్యం జరిగిన తీరు ఆడపిల్లల భద్రతపై కొత్త భయాలు రేపింది.

ఇదిలా ఉండగా, అభయ కేసు నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే కొన్ని తీవ్రమైన నేరాల విషయంలో ప్రజలు భావోద్రేకాలకి గురౌతారు. ఆ ఆవేశమే యాసిడ్ దాడి చేసిన నేరస్తుడిని ఎన్‌కౌంటర్ ద్వారా హతం చేయాలని, ఉగ్రవాద దుశ్చర్యలకి పాల్పడిన వ్యక్తిని విచారణ లేకుండా ఉరితీయాలని, రేప్ చేసిన వాడిని నపుంసకుడుగా మార్చాలని డిమాండ్లు చేయిస్తుంది. వ్యక్తులు లోనయ్యే ఇటువంటి ఆవేశకావేశాలకి వ్యవస్థలు లోను కాకూడదని సుప్రీం కోర్టు పలుసార్లు వ్యాఖ్యానించింది.

తాజాగా, అభయ కేసు విషయానికి వస్తే, నిందితులైన డ్రైవర్లు సతీష్, వెంకటేశ్వర్లు తరపున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. సదరు బార్ అసోసియేషన్ ఈ నిర్ణయం ద్వారా బహుశా ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచుకుంది:
అభయ కేసులో నిందితుల తరఫున వాదించడమంటే అన్యాయానికి వకాల్తా పుచ్చుకున్నట్టే కాబట్టి, దానిని ఆ బార్ అసోసియేషన్‌లో సభ్యులైన న్యాయవాదులు అందరూ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా, తాము అప్పటి వరకీన్యాయం వైపే నిలబడ్డామని, అన్యాయం పక్షాన ఏనాడూ లేనేలేమని. ఒకవేళ న్యాయం పట్ల వారి నిబద్ధత నిజమే అని నమ్మాల్సి వచ్చినా, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకునే హక్కు మాత్రం బార్ అసోసియేషన్‌కు లేదనే చెప్పుకోవాలి. కోర్టులో న్యాయం పొందటం దేశంలోని ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ఆ రాజ్యాంగ హక్కు కాలరాచే తీర్మానం చేయడానికి బార్ అసోసియేషన్‌కు హక్కు లేదని పలు సందర్భాలలో సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. "మీ అంతట మీరే చట్టము, తీర్పు కాబోరని" దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో చేసిన హితవుల్ని బార్ అసోసియేషన్లు పెడచెవిన పెట్టడానికి కారణం- అటువంటి సంచలనాత్మక తీర్మానాల ద్వారా మీడియాలో వచ్చే ప్రచారమే.

Advertisement
Advertisement