బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మల్లికార్జున గెలుపు | Sakshi
Sakshi News home page

బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మల్లికార్జున గెలుపు

Published Thu, Jun 19 2014 4:44 AM

బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మల్లికార్జున గెలుపు

- మహిళా ప్యానల్ ఓటమి
- ప్రభావం చూపిన ‘నోటా’

అనంతపురం లీగల్: అనంత న్యాయవాదుల సంఘం కార్యవర్గానికి బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా బి.మల్లికార్జున విజయం సాధించారు. ఆయనకు 144 ఓట్లు పోల్ కాగా, ఈశ్వరికి 96, జనార్దన్‌కు 75 ఓట్లు వచ్చాయి. నోటా కింద 9 ఓట్లు పోలయ్యాయి. మూడు ఓట్లు చెల్లలేదు. కాగా, ఉపాధ్యక్ష స్థానానికి జి.పద్మజ, కోశాధికారిగా ఎం.శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ప్రధాన కార్యదర్శి స్థానానికి రాజేంద్రప్రసాద్, రామాంజనేయ చౌదరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా రాజేంద్రప్రసాద్ 18 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ స్థానానికి 22 ఓట్లు నోటాకు పడ్డాయి.

కార్యదర్శిగా గెలుపొందిన జయమోహన్ 165 ఓట్లు  సాధించగా, మహిళా ప్యానెల్ అభ్యర్థి బి.సుజనకు 135 ఓట్లు, 22 ఓట్లు నోటాకు పడగా, 5 ఓట్లు  చెల్లలేదు. కేఎస్ జయరాం మెమోరియల్ గ్రంథాలయ కార్యదర్శిగా బాలకృష్ణ 208 ఓట్లు సాధించి గెలుపొందారు. మహిళా ప్యానెల్ అభ్యర్థి మేడా అనూరాధకు 98 ఓట్లు పడగా 17 ఓట్లు నోటాకు 4 ఓట్లు చెల్లకుండా పోయాయి.  ఎన్నికల నిర్వహణ అధికారులుగా సీనియర్ న్యాయవాదులు పీఎల్ ఈశ్వరరెడ్డి, రాజారాం, రాంకుమార్,  గురుప్రసాద్‌లు, సహాయకులుగా  శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌రావు, నరసింహులు(చిట్టి), జాఫర్‌సిద్దిఖి వ్యవహరించారు. కేవలం 20 మంది మాత్రమే ఉన్న మహిళలు  ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు తమ ఉనికిని చాటాయన్నారు.  రాయలసీమ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాల్మీకి గంగాధర్ విజేతలకు అభినందనలు తెలిపారు.
 
న్యాయవాది కృష్ణవేణి ఓటుపై వేటు
తాను  సభ్యత్వ రుసుం  చెల్లించినా ఓటు లేదనటంపై న్యాయవాది కృష్ణవేణి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 వరకు సభ్యత్వం ఉండేలా 2012 డిసెంబరులోనే ముందస్తుగా రుసుం చెల్లించాలనంటూ రసీదు చూపించినా ఫలితం లేకపోయింది. ఆమె సభ్యత్వం వివరాలున్న పేజీని కొట్టి వేసినందున ఓటుహక్కు ఇవ్వలేమని ఎన్నికల అధికారులు తెగేసి చెప్పారు. మాజీ అధ్యక్షుడు జి.నరసింహులు ఆమె సభ్యత్వాన్ని నిర్ధారించినా ఫలితం లేకపోయింది.  ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన జి.పద్మజ ఓటు వినియోగించుకోవటానికి ఆమెను అనుమతించాలని కోరినా ససేమిరా అనటంతో విధిలేక కృష్ణవేణి వెనుతిరిగారు. బార్ అసోసియేషన్ సభ్యత్వ లెడ్జరులో తనకు సంబంధించిన వివరాల కొట్టివేతకు కారణాలు చూపాలని డిమాండు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement