బతుకమ్మ సంబురం | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబురం

Published Fri, Oct 4 2013 2:44 AM

bathukamma celebrations


 సాయుధ పోరాటానికి ఉన్నంత చరిత్ర, గుర్తింపు తెలంగాణలో బతుకమ్మ పాటకు కూడా ఉంటుంది. ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో ఆ పాటలు మమేకమైపోతాయి. కష్టం, సుఖం, నిట్టూర్పు, పోరుజీవితంలో ఆ పాటలు జీవిస్తూనే ఉంటాయి. సృష్టికి మూలమైన త్రిభుజాకారంలో పూల గోపురాన్ని పేర్చి, కూర్చి ప్రకృతి రూపంగా ఆది పరాశక్తిని కొలుస్తూ ఆరాధిస్తూ బతుకమ్మ ఆడే విధానం ఇప్పటికీ దేశ విదేశాల వారిని ఆకట్టుకుంటోంది. మనం దశాబ్దాల క్రితం నుంచి ఆడుతున్న బతుకమ్మ ఆటను కుమ్మి, కైకోట్టికల్, గర్జా, గంగోర్ అని పిలుస్తూ వివిధ రాష్ట్రాల్లో ఈ ఆటను ఆడుతూనే ఉంటారు. అంతటి గొప్పతనం బతుకమ్మది.
 - న్యూస్‌లైన్, దేవరకొండ/ సూర్యాపేట/భువనగిరి
 
 బతుకమ్మ చరిత్రపై....
 బతుకమ్మ చరిత్రపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఈమూడు కథలనే ప్రధానంగా చెప్పుకుంటారు. పూర్వకాలంలో తెలంగాణ పల్లెల్లో మహిళలపై జరిగిన దాష్టీకాలతో ఆత్మహత్య చేసుకున్న బాలిక ఉదంతమే బతుకమ్మ పండగగా చెబుతారు. భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి కన్నీరు కార్చిన ప్రజలు చేసేదేమిలేక చిరకాలం బతుకమ్మా అంటూ దీవించారట. అప్పటి నుంచి బతుకమ్మను కీర్తిస్తూ మహిళలు పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలా గే బతుకమ్మను కీర్తిస్తూ పాటలు పాడితే తమకు ఎలాంటి కష్టాలు వచ్చినా  పార్వతీ దేవి కాపాడుతుందని నమ్ముతారు.
 
 ధర్మాంగధుడి కథ...
 దక్షిణా పథాన్ని పరిపాలించిన చోళరాజు ధర్మాంగధుడు సంతానంకోసం చేసిన పూజలవల్ల ఆ రాజు భార్య.. కుమార్తెకు జన్మనిచ్చింది.  ఆడకూతురుకు బాలరిష్టాలు వచ్చినా వాటి నుంచి బయటపడడానికి రాజు దంపతులు బతుకమ్మా అని నామకరణం చేశారట, అలా ఆ మె పెరిగి పెద్దదైందని మరో కథనం ప్రచారంలో ఉంది.  
 
 జానపద కథ...
 ఓ గ్రామంలో కాపు దంపతులకు ఆరు కాన్పుల్లో జన్మించిన సంతానం మరణిం చారు. ఏడో కాన్పులో జన్మించిన పాప బత కాలని బతుకమ్మ అని పేరు పెట్టారు. బతుకమ్మకు యుక్తవయస్సు వచ్చాక వివా హం చేశారు. అత్తారింటికి వెళ్లిన బతుక మ్మ.. ఆడబిడ్డతో కలిసి నదికి స్నానానికి వెళ్లింది. బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తున్న సమయంలో ఆ దుస్తులు గాలికి కొట్టుకుపోయాయి. వాటిని తీసుకొచ్చిన తర్వాత ఆడబిడ్డ దుస్తులను బతుకమ్మ కట్టు కోవడంతో ఆగ్రహించి బతుకమ్మ ను చంపినట్లు కథనం. అక్కడే బతుకమ్మ ను బొందపెట్టి ఆడబిడ్డ ఇంటికి వెళ్లింది. బొందపై తంగేడు కొమ్మలు పెట్టినట్టు గ్రా మాల్లో చెప్పుకుంటారు. భర్తకు రాత్రిక లలో కన్పించి తన వృత్తాంతాన్ని చెప్ప డంతో ఆయన అక్కడికి వెళ్లి బతికించుకొని వెళ్లాడట. అప్పటి నుంచి బతుకమ్మను తంగేడు పూలతో పూజించి గ్రామస్తులు మోక్షం పొందినట్లు కథలుగా చెప్పు కుంటారు.
 
 మహిళల శ్రమ సౌందర్యానికి, ప్రకృతి రమణీయతకు బతుకమ్మ పండగ నిదర్శనం. ఈ పండగ తెలంగాణలోని సంస్కృతి, సంప్రదాయాలకు, భక్తిభావానికి ప్రతీక. కన్నె పిల్లల నుంచి పండు ముదుసలి, ముత్తైవుల వరకు బతుకమ్మ పండగను ఆనందంగా  జరుపుకుంటారు. భాద్రపద బహుళ పంచమి నుంచి సద్దులబతుకమ్మ వరకు అంటే తొమ్మిది రోజుల పాటు ఆట పాటలతో నిర్వహిస్తారు. ఈ పండగ శరదృతువులో వస్తున్నందున శరన్నవరాత్రులుగా కూడా జరుపుకుంటారు. ప్రకృతికి ప్రతిరూపమైన పరమేశ్వరిని కొలుస్తూ పండగ చేస్తారు.
 
 బొడ్డెమ్మ ఉత్సవాలతో ప్రారంభం
 వినాయక నవరాత్రులు ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే బొడ్డెమ్మ పండగతో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. వీటిని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ తరువాత ఎంగిలిపూవు బతుకమ్మను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. అయితే చివరి రోజు మాత్రం సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. ప్రతిరోజూ సాయంత్రం గ్రామంలోని దేవాలయం వద్దకు మహిళలు చేరుకుని బతుకమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ రకరకాల పాటలు పాడుతారు. రాత్రి పొద్దు పోయే వరకు బతుకమ్మలు ఆడుతారు. అత్తవారిళ్లలో పడుతున్న కష్టాలను పూర్వకాలం పాటల రూపంలో కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలియజేసే వారు. అలాగే పురాణ గాథలను ఆలపించి అందులో చెడుపై మంచి సాధించిన విజయాన్ని వారు గుర్తు చేసుకుంటారు. జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కొని విజయం సాధించాలో బతుకమ్మ పాటల ద్వారా ప్రబోధం జరిగేదట. ఇలా మహిళల జీవన విధానంలోని అన్ని కోణాలను బతుకమ్మ పండగ స్పృశిస్తుంది.
 
 బతుకమ్మలను పేర్చడం ఇలా..
 రంగురంగుల పూలతో బతుకమ్మలను పేరుస్తారు. గునుగు, తంగేడు, బంతి, అడవి చామంతి, నందివర్ధనం, మల్లె, గుమ్మడి, బీర, కట్లపూలు, గోరంట, కలువ,గన్నేరుపూలతో బతుకమ్మలను మహిళలు పోటీపడి తయారు చేస్తారు. పూలను రాగి తాంబాలంలో బతుకమ్మగా పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పేర్చి ఆపై రంగు రంగుల పూలతో బతుకమ్మను అమర్చి చివరలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను తమల పాకుల్లో పెట్టి కుంకుమ బొట్లు పెట్టి  ఊదు బత్తీలను వెలగించడంతో పాటు నూనే దీపాలను వెలి గిస్తారు. దానిని ఇంట్లో గల దేవుడి గదిలో ఉంచి పూజిస్తారు.
 
 సద్దుల బతుకమ్మకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు
 వర్షాకాలం చివరలో పంటలు ఇంటికి చేరిన సమయంలో వస్తున్న సద్దుల బతుకమ్మ పండగను జరుపుకోవడంలో తరతరాల సంప్రదాయం దాగి ఉంది.  వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు, వాగులు, వర్రెలు నీటితో కళకళ లాడుతూ ఉంటాయి. ఈ సమయంలోనే  తెలంగాణ ప్రజలు జరుపుకునే రెండు ప్రధాన పండగల్లో సద్దుల బతుకమ్మ, దసరా పండగలు అతిముఖ్యమైనవి. రోజు విడిచిరోజు మూడు రోజుల్లో జరుపుకునే రెండు పండగల్లో మహిళలు జరపుకునే సద్దుల  బతుకమ్మ ఎంతో విశిష్టమైంది. ఈపండగ కోసం నెలరోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆడపడుచులు ఏ ఊరిలో ఉన్నా పుట్టింటికి చేరుకుని ఈ పండగను ఆనందంగా జరుపుకుంటారు. దీనిని పార్వతీ దేవికి ఇష్టమైన పండగగా భావిస్తారు. పండగ సందర్భంగా కుటుంబ సభ్యుల కోలాహలం ప్రతి ఇంటా నెలకొంటుంది.
 
 వాయినం
 శక్తి స్వరూపిణి పార్వతీ దేవికి ప్రతిరూపంగా భావించే బతుకమ్మను రాత్రి పొద్దు పోయే వరకు ఆడిన అనంతరం గ్రామంలోని చెరువుల్లో నిమజ్జనం చేయడానికి మహిళలు ఊరేగింపుగా వెళతారు. పాటలు పాడుకుంటూ వెళ్లి చెరువుల వద్ద మరోసారి బతుకమ్మను పరమేశ్వరుని ఇష్టసతులైన గంగ- గౌరిలను స్తుతిస్తూ పాటలు పాడుతారు. ‘పోయిరావమ్మా బతుకమ్మ పోయిరావమ్మా’ అంటూ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. అనంతరం ముత్తైవులు పరస్పరం వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు.  
 
     మొదటిరోజు బతుకమ్మతో పాటు వక్కలు, తులసి ఆకు, సత్తుపిండిని వాయనంగా తీసు కుంటారు.
     రెండో రోజు పప్పు, బెల్లం
     మూడో రోజు బెల్లం, శనగపప్పు
     నాలుగో రోజు నానబెట్టిన బియ్యం
     ఐదో రోజు అట్లు పంచుతారు.
     ఆరో రోజు అర్రెం అంటారు. ఆ రోజు బతు కమ్మ ఆడరు. అంటే బతుకమ్మ అలిగిందని జానపదులు                                 తెలుపుతున్నారు.
     ఏడో రోజు పప్పు, బెల్లం
     ఎనిమిదో రోజు నువ్వులు, బెల్లం
     తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు. పులిహోర, దద్దోజనం, సత్తుపిండి, చక్కెర లడ్లు, బెల్లం లడ్లు, నువ్వుల ముద్దలు, శనగ పట్టి, పెసరపప్పు చక్కెర ఇలా సద్దులను తీసుకెళ్లి అందరికీ పంచి ఆనందిస్తారు.
 
 బండారు బతుకమ్మ
 బతుకమ్మపై పీహెచ్‌డీ చేసిన సుజాత
 వృత్తి, ప్రవృత్తికి సమన్యాయం చేస్తూ...ఇప్పటికీ చాలా మంది ఉయ్యాల పాటలు పాడుతూ శ్రమను మరిచిపోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ బతుకమ్మ పాటలోని పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు, భాషా విశేషాలను పరిశోధనాంశంగా ఎన్నుకుని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు దేవరకొండకు చెందిన డాక్టర్ సుజాత శేఖర్. అందరికీ భిన్నంగా బతుకమ్మ పండగను సుజాతశేఖర్..  పీహెచ్‌డీకి ఎంచుకున్నప్పుడు చాలా మంది అభినందించారు.
 
 బాధ్యతలు నేరవేర్చడంలో తృప్తి ఉంది
 ఒకవైపు వృత్తి, మరోవైపు ప్రవృత్తి, ఇంకో వైపు కుటుంబ బాధ్యతలు నేరవేర్చడంలో శ్రమ ఉన్నా ఆత్మ సంతృప్తి మాత్రం కలుగులుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మపాట వినడం, భర్త శేఖర్ ప్రోత్సాహం, చిన్నప్పుడు బతుకమ్మను నెల రోజులకు ముందు నుంచే ఆడడం వల్ల చిన్నప్పటి నుంచి బతుకమ్మ అంటే చాలా ఇష్టం. అందుకే కావచ్చు పీహెచ్‌డీ కూడా ఆ అంశం మీదే చేయాలన్పించింది.  బతుకమ్మపాటలను బతికించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉందని గుర్తించాలి.
 
 పేరు : బండారు సుజాతశేఖర్
 భర్తపేరు : దాచేపల్లి బుచ్చయ్య (శేఖర్)
 వృత్తి : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
 ప్రస్తుతం: స్టేట్ కో-ఆర్డినేటర్, భాషా విభాగం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్.
 పరిశోధనాంశం : పీహెచ్‌డీ (తెలుగు సాహిత్యం) బతుకమ్మపండగ
 ప్రవృత్తి : రచనలు, నూతన విద్యావిధానంలో విద్యాబోధన ప్రక్రియలో అన్వేషణ
 అవార్డులు
  1993లో డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ స్పీకర్ అవార్డు
  1994లో దివంగత నీలా జంగయ్య స్మారక సాహితీ అవార్డు
  1996లో వాసవీ ఆర్ట్స్ థియేటర్ వారిచే వాసవీ యూత్ అవార్డు
  1996లో యునెస్కో స్వర్ణోత్సవ సర్టిఫికెట్
  1999లో జిల్లా సాహితీ అవార్డు
  2005లో ఎస్‌ఎస్‌వై సిద్ద పురస్కారం, బీఎన్ సాహిత్య పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి.
 
 
 
 

Advertisement
Advertisement